మింత్రాకు అనంత్ నారాయణన్ గుడ్‌బై

మింత్రాకు అనంత్ నారాయణన్ గుడ్‌బై

 న్యూఢిల్లీ : ఫ్యాషన్ దుస్తుల ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ మింత్రా-జబాంగ్ సీఈవోగా అనంత్ నారాయణన్ తప్పుకున్నారు. ఈ మేరకు సోమవారం సదరు సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. మింత్రా-జబాంగ్ మాతృ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ నిరుడు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల జరిగిన స్థాన చలనాలు, ఇతరత్రా మార్పుల మధ్య అనంత్ వెళ్లిపోతున్నారన్న ఊహాగానాలు వెలువడగా, దాన్ని ధ్రువీకరిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు మింత్రా వర్గాలు స్పష్టం చేశాయి. అనంత్ ఆధ్వర్యంలో మింత్రా-జబాంగ్ అభివృద్ధిపథంలో నడిచిందని ఈ సందర్భంగా సంస్థ ఆయన సేవలను కొనియాడింది. బయటి అవకాశాల కారణంగానే ఆయన రాజీనామా చేశారనీ పేర్కొన్నది. 

అయితే ఫ్లిప్‌కార్ట్ నుంచి బిన్నీ బన్సల్ తప్పుకున్న దగ్గర్నుంచి అనంత్ రాజీనామాపై ఊహాగానాలు తీవ్రం కావడం గమనార్హం. కాగా, మింత్రా-జబాంగ్ కొత్త అధిపతిగా అమర్ నగరం ఎన్నికయ్యారు. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తికి ఈయన రిపోర్టు చేయనున్నారు. ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ నుంచి మింత్రాకు వచ్చిన అమర్‌కు.. గ్రూప్‌తో ఏడేండ్ల అనుబంధం ఉన్నది. ఇక అనంత్ వెళ్లిపోవడంతో మింత్రా-జబాంగ్‌లో సీఈవో పదవిని తొలగించిన యాజమాన్యం.. ఆ స్థానంలో హెడ్ హోదాను తీసుకురావడం విశేషం. అనంత్.. స్టార్ గ్రూప్‌లోని హాట్‌స్టార్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తున్నది.