కివీస్‌తో సమరానికి  ’సై’

కివీస్‌తో సమరానికి  ’సై’

 నేపియర్‌ : ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగిం చిన కోహ్లీసేన రెట్టించిన ఉత్సాహంతో న్యూజిలాండ్‌ పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో భారత్‌ తలపడనుంది. కంగారూ గడ్డపై చరిత్ర సష్టించిన టీమిండియా అదే ప్రదర్శనను కివీస్‌పైనా ప్రదర్శించాలని పట్టుదలతో ఉంది. ప్రపంచ కప్‌కు ముందు మరికొద్ది వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఉండడంతో ప్రతి ఒక్కరి ప్రదర్శన ను బిసిసిఐ నిశితంగా పరిశీలించి తుదిజట్టు ను ఎంపిక చేసే అవకాశముంది. దీంతో ఈ సిరీస్‌లోనూ ఆటగాళ్లు అత్యుత్యమ ప్రదర్శనను చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఆసీస్‌పై వన్డే సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా మిడిలార్డర్‌ కూర్పుపై ఇప్పటికీ సందేహాలే నెలకొన్నాయి. సరైన కూర్పు కోసం చేసే చివరి ప్రయత్నం ఇదే కావాలని విశ్లేషకులు భావిస్తున్నారు. కంగారూ గడ్డపై వరుసగా మూడు అర్ధశతకాలు సాధించిన మాజీ సారథి ధోనీ పట్ల డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆనందం నెలకొంది. కాగా కివీస్‌లో మైదానాలు చిన్నవి. కివీస్‌ జట్టులో ట్రెంట్‌ బౌల్ట్‌, లాకీ ఫెర్గూసన్‌, టిమ్‌ సౌథీ పేస్‌ త్రయంతో కోహ్లీ సేనకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ ఎప్పటికీ కఠినమైన జట్టే. అక్కడ భారత్‌ 35 వన్డేల్లో తలపడగా కేవలం 10 మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. ఇంతకుముందు 2014 పర్యటనలో ఐదు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 4-0తో టీమిండియాపై విజయ దుందుభి మోగించింది. ఒక మ్యాచ్‌ రద్దైంది. ఈసారి తొలి మ్యాచ్‌ జరిగే మెక్‌ లీన్‌ పార్క్‌లో వాతావరణం పొడిగా ఉంది.

ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఫామ్‌లో లేక పోవడం భారత్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్య. గత 9 మ్యాచుల్లో అతడి అత్యధిక స్కోరు 35 మాత్రమే. ధోనీని ఏ స్థానంలో ఆడించాలన్న విషయంపైనా స్పష్టత లేదు. సస్పెం డైన హార్దిక్‌ పాండ్యా వచ్చే వరకు జట్టును సమతూ కంగా ఉంచడం కోహ్లీకి కష్టమే! ఈ సిరీస్‌కు ఎంపికైన యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌కు తొలి మూడు వన్డేల్లో అవకాశం దొరక్కపోవచ్చు. అంబటి రాయుడుతోపాటు నాలుగో స్థానానికి దినేష్‌ కార్తీక్‌ల మధ్య పోటీ నెలకొనడంతో ఇద్దరిలో ఒకరికి చోటు దక్కడం ఖాయం. నేపియర్‌లో భారీ స్కోరుకు అవకాశం ఉండటంతో దినేశ్‌ కార్తీక్‌, కేదార్‌ జాదవ్‌లను ముందు పంపించే అవకాశం ఉంది.

ఇక బౌలింగ్‌ విభాగం విషయానికి వస్తే భువనేశ్వర్‌, మహ్మద్‌ షమి పేస్‌ బాధ్యతలు తీసుకోనున్నారు. మూడో పేసర్‌ అవసరమైతే మహ్మద్‌ సిరాజ్‌, ఖలీల్‌ అహ్మద్‌లో ఒకరికి తుది జట్టులోకి తీసుకోవచ్చు. న్యూజిలాండ్‌ టాప్‌ ఆర్డర్‌ అద్భుతంగా కనిపిస్తోంది. ఆ జట్టులో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకరైన సారథి కేన్‌ విలియమ్సన్‌ నిలకడకు మారు పేరు. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. 2018లో కోహ్లీ తర్వాత ఎక్కవ సగటు (92.00) అతడికే ఉంది. ఇటీవల తమ దేశంలో పర్యటించిన శ్రీలంకతో వన్డే సిరీస్‌లో తలెత్తిన లోపాలను సరిదిద్దుకొని భారత్‌తో తొలి మ్యాచ్‌కు సన్నద్ధమయ్యామని కివీస్‌ జట్టు కెప్టెన్‌ విలియమ్సన్‌ తెలిపాడు. ఏదేమైనప్పటికీ తొలి మ్యాచ్‌ గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.

భారత జట్టు : విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ (వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, విజరు శంకర్‌, శుభ్‌మన్‌ గిల్‌, యుజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఖలీల్‌ అహ్మద్‌.

న్యూజిలాండ్‌ జట్టు : కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), రాస్‌ టేలర్‌, టామ్‌ లూథమ్‌, మార్టిన్‌ గుప్తిల్‌, కొలిన్‌ డి గ్రాండ్‌హౌమ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, హెన్రీ నికోల్స్‌, డగ్‌ బ్రాస్‌వెల్‌, లాకీ ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ, కొలిన్‌ మున్రో, ఇష్‌ సోధి, మిచెల్‌ శాంట్నర్‌, టిమ్‌ సౌథి.

మహిళా జట్టూ రెఢీ
టీమిండియా మహిళాజట్టు న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా ఆ జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల్లో పోటీపడనుంది. వన్డే జట్టుకు మిథాలీరాజ్‌, టీ20 జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యం వహించనున్నారు. కివీస్‌ మహిళా జట్టుతో 24, 29, ఫిబ్రరి 2న మూడు వన్డే మ్యాచ్‌ల్లో తలపడనుంది. అలాగే టీ20 పోటీలు ఫిబ్రవరి 6,8,10న జరగనున్నాయి.