ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రా

ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రా

    సిడ్నీ: టీమిండియా-ఆస్ట్రేలియా ఎలెవన్‌ల జట్ల మధ్య జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. శనివారం భారత బౌలర్లు విఫలమైనా బ్యాట్స్‌మెన్లు మాత్రం అంచనాలను అందుకున్నారు. మ్యాచ్‌ చివరి రోజు ఆరు వికెట్ల నష్టానికి 356 పరుగులతో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ ఎలెవెన్‌ జట్టు 544 పరుగులకు ఆలౌటైంది. శతకం చేసిన నీల్సన్‌ టీమిండియా సారథి కోహ్లీ బౌలింగ్‌లో ఔటవ్వడం విశేషం. లోయర్‌ ఆర్డర్‌ కూడా రాణించడంతో ఆస్ట్రేలియా ఎలెవన్‌ భారీ స్కోరు నమోదు చేయగల్గింది. టీమిండియా తరఫున 10మంది ఆటగాళ్లు బౌలింగ్‌ చేశారు. అశ్విన్‌ రెండు, బుమ్రా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారతజట్టు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌ రాణించడంతో మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. గాయపడిన పృథ్వీ షా స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన మురళీ విజయ్‌ మెరుపు శతకం(132 బంతుల్లో 129)తో విజృంభించాడు. 74 పరుగుల వ్యక్తిగత స్కొర్‌ వద్ద కార్డన్‌ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఒకే ఓవర్‌లో 26 పరుగులు రాబట్టి శతకం పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపర్చిన కేఎల్‌ రాహుల్‌ సైతం అర్ధశతకం(98 బంతుల్లో 62)తో ఆకట్టుకోవడం మరో విశేషం.