అమలాపాల్‌కు కాజల్‌ విషెస్‌..

అమలాపాల్‌కు కాజల్‌ విషెస్‌..

  చెన్నై: నటి అమలాపాల్‌కు కాజల్‌ అగర్వాల్‌కు మధ్య మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉంది. ఈ విషయాన్ని నటి కాజల్‌అగర్వాలే స్వయంగా వెల్లడించింది. సంచలన నటిగా ముద్రవేసుకున్న అమలాపాల్‌ భర్త విజయ్‌కు విడాకులిచ్చిన తరువాత కథానాయకిగా బిజీ అయిపోయింది. చేతిలో పలు చిత్రాలు. ఇక ఆ మధ్య ఖరీదైన కారును కొని కేరళ రోడ్డు రవాణాశాఖకు కుచ్చు టోపీ పెట్టి పుదుచ్చేరిలో రిజిస్టర్‌ చేసిన కేసులో పోలీస్‌స్టేషన్‌ వరకూ వెళ్లొచ్చింది. 

అమలాపాల్ ఇటీవల తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఒక వ్యాపారవేత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. అమలాపాల్‌ నటించిన భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతుండగా, తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి రెడీ అయిపోయింది. నూతన దర్శకుడు కేవీ.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెంచరీ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌ పతాకంపై జోన్స్‌ నిర్మిస్తున్నారు. 

విశేషం ఏమిటంటే అదో అంద పరవై పోల పేరుతో తెరకరెక్కనున్న ఈ చిత్రంలో అమలాపాల్‌ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. త్వరలో సెట్‌ పైకి వెళ్లనున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం విడుదల చేశారు. దీన్ని కాజల్‌ అగర్వాల్‌ ట్విట్టర్‌ ద్వారా ఆవిష్కరించడం మరో విశేషం. ఈ సందర్భంగా బ్యూటీఫుల్‌ లేడీ, తన ఫ్రెండ్‌ అమలాపాల్‌కు శుభాకాంక్షలు, ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నాను అని కాజల్‌ పేర్కొన్నారు