చింతచిగురు మ‌ట‌న్‌.. స్పెష‌ల్ డిష్‌

చింతచిగురు మ‌ట‌న్‌.. స్పెష‌ల్ డిష్‌

చింతచచ్చినా.. పులుపు చావలేదని పెద్దలు ఉత్తగనే అనలేదు. అవును మరీ.. చిగురు దశలోనే నోరూరించే రుచితో అదరగొట్టే వంటకాలకు పెట్టింది పేరు.ఈ కాలంలో విరివిగా దొరికే.. చింతచిగురు రుచులతో ఈవారం స్పెషల్ వంటలు మీకోసం రెడీ చేశాం. మామూలు సీజన్‌లో ఆదివారం వచ్చిదంటే.. మటన్ తెచ్చి మసాలా వేసి ఘుమ్‌ఘుమాయించేస్తాం. కానీ ఇప్పుడు చింతచిగురు సీజన్ కదా.. అదే మాంసాన్ని చింతచిగురుతో కలిపి వండితే.. ఆ రుచికి నాలుకకు పట్టిన తుప్పు వదలాల్సిందే! ఒక్క మాంసమేంటి..? రకరకాల చింతచిగురు స్పెషల్స్ మీకోసం అందిస్తున్నాం.. చదివేయండి.. వండి వార్చేయండి.


చింతచిగురు మాంసం.. కావల్సిన పదార్థాలు
కొత్తిమీర పొడి : 1 టీస్పూన్, పుదీన : ఒక రెమ్మ
కొత్తిమీర : ఒక రెమ్మ, తురిమిన కొబ్బరి : 1 టీస్పూన్, 
అల్లంవెల్లులి పేస్ట్ : 1 టీస్పూన్
పసుపు : 1 టీస్పూన్, కారంపొడి : 1 టీస్పూన్
చింతచిగురు : అర కిలో, మటన్ : అర కిలో
ఉల్లిగడ్డ : ఒకటి (పెద్దది), నూనె : 1 టేబుల్‌స్పూన్
ఆవాలు : 1 టీస్పూన్, జీలకర్ర : 1 టీస్పూన్
ఉప్పు : తగినంత

ఇలా వండాలి
ఒక పాన్‌లో ఆయిల్ పోయండి. అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా వేసి బాగా కలుపండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చింతచిగురు వేయండి. ఆ తర్వాత వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఐదు నిమిషాల పాటు ఉడుకనివ్వండి. ఇప్పుడు కొబ్బరిపొడి, మాంసం వేసి కొద్దిగా నీరు పోసి ఉప్పు వేయండి. మాంసం ఉడికిన తర్వాత కొత్తమీర పొడి, కారంపొడి వేసి బాగా కలిపి మూతపెట్టేయండి. మాంసం, చింతచిగురు రెండూ కలిసిపోయేంత వరకు ఉడుకనివ్వండి. అవసరమనుకుంటే మాంసం ముందే కుక్కర్‌లో ఉడికించి పెట్టుకున్నా పర్వాలేదు. అలా ఉడికించుకుంటే చింతచిగురుతో కలిపి మరో ఐదు నిమిషాలు డ్రై అయ్యేంత వరకు ఉడికించాల్సి ఉంటుంది. ఐదే ఐదు నిమిషాల్లో చింతచిగురు మాంసం రెడీ అవుతుంది. చివర్లో కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేసి దించేయాలి. ఐదు నిమిషాలయ్యాక వేడి వేడిగా లాగించేస్తే.. రుచి అదిరిపోతుంది.