ఎముకలు పుష్టిగా ఉండాలంటే..?

ఎముకలు పుష్టిగా ఉండాలంటే..?

  కాల్షియం మన శరీరంలోని ఎముకలు, దంతాల పటుత్వంలో కీలకపాత్ర పోషిస్తుంది. కండరాలు, కణాలు, నాడులు సరిగ్గా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది. అందుకే పెద్దలు రోజుకు 1వేయి మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తుంటారు. కాల్షియం ప్రధానంగా పాలు, పదార్థాల నుంచి లభిస్తుంది. అయితే పాలు ఇష్టం లేని వారు, లాక్టోజ్ పడని వారి సంగతేంటి ? అంటే.. వారు ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకుంటే సరిపోతుంది. దీంతో కాల్షియంతోపాటు ఇతరత్రా విటమిన్లు, మినరల్స్ కూడా అలాంటి వారికి లభిస్తాయి.

అంజీర్...డ్రై ఫ్రూట్ రూపంలో ఉండే అంజీర్ పండ్లను నిత్యం అరకప్పు మోతాదులో తీసుకుంటే మనకు 121 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇ ందులో పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. కండరాల పనితీరును, గుండె లయను నియంత్రించడం వంటి పలు రకాల పనుల్లో పాలు పంచుకునే మెగ్నిషియమూ వీటితో మనకు లభిస్తుంది.

నారింజ...ఒక పెద్ద నారింజ పండులో 74 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండడంతోపాటు క్యాలరీలు తక్కువగానే ఉంటాయి.

చేపలు...చేపల ద్వారా కూడా మన శరీరానికి కావల్సిన కాల్షియం లభిస్తుంది. అలాగే విటమిన్ బి12, విటమిన్ డి లు కూడా చేపల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తాయి.

బెండకాయ...మలబద్దకాన్ని నివారించే ఫైబర్ బెండకాయలో పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు బెండకాయలను తింటే 82 మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది. దీంతోపాటు విటమిన్ బి6, ఫోలేట్‌లు కూడా బెండకాయలతో మనకు లభిస్తాయి.

పనీర్...పనీర్‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావల్సినంత కాల్షియం లభిస్తుంది. దీని వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. శరీరానికి శక్తి అందుతుంది.

బాదంపప్పు...30 గ్రాముల బాదంపప్పు తింటే మనకు 75 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. అయితే బాదంపప్పును నానబెట్టి పొట్టు తీసి తింటే మేలు కలుగుతుంది. బాదం పప్పును తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.