బాలి బీచ్‌లో ‘భారతీయ’ ఎకనామిస్ట్‌ మృతి

బాలి బీచ్‌లో ‘భారతీయ’ ఎకనామిస్ట్‌ మృతి

  జకర్తా : ప్రముఖ ఆర్థిక నిపుణురాలు ఆకాంశ పాండే ఇండోనేషియాలోని బాలి బీచ్‌లో మృతిచెందారు. శనివారం సాయంత్రం బీచ్‌లోని నిషేధిత ప్రాంతంలో ఆమె స్విమ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బలమైన అలలు ఒక్కసారిగా ఆమెను తాకడంతో ఆకాంశ ప్రవాహంలో కొట్టుకుపోయారు. బీచ్‌ లైఫ్‌గార్డ్‌ ఆమెని కాపాడేందుకు ప్రయత్నించారు. అలల్లో కొట్టుకుపోతున్న ఆమెను బయటకు తీసుకువచ్చిన సిబ్బంది.. వెంటనే ఆమెను సిలోమ్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆకాంశ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

భారత్‌ సంతతికి చెందిన ఆకాంశ ప్రస్తుతం యూఎస్‌లో జీవనం కొనసాగిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్‌లో సీనియర్‌ హెల్త్‌ ఎకనామిస్ట్‌గా ఆమె పనిచేస్తున్నారు. ఈ ఘటనపై బీచ్‌ అధికారులు మాట్లాడుతూ.. అకాంక్ష స్విమ్‌ చేస్తున్న ప్రాంతంలో అలల వేగం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అక్కడికి ఎవరు వెళ్లకుండా ఉండేందుకు సూచికలు కూడా ఏర్పాటు చేశామన్నారు. కానీ ఆకాంశ అవేమీ పట్టించుకోలేదని అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు. లైఫ్‌గార్డ్‌లు రెండుసార్లు ఆకాంశను హెచ్చరించిన కూడా వారి మాట వినకుండా ఆమె ప్రాణాలు కొల్పోయిందన్నారు.