వినీలాకాశంలో నేడు మహాద్భుతం

వినీలాకాశంలో నేడు మహాద్భుతం

  కేప్ కెనవరాల్ : వినీలాకాశంలో మరో మహాద్భుతం ఆవిష్కృతమయ్యేందుకు ఘడియలు సమీపిస్తున్నాయి. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖపైకి రానుండటంతో సోమవారం ఒకేసారి సంపూర్ణ చంద్రగ్రహణం, సూపర్‌మూన్ దర్శనమివ్వనున్నాయి. ఈ ఏడాదితోపాటు వచ్చే ఏడాది వరకు ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం ఇదొక్కటే. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు భూమికి అత్యంత చేరువగా రానుండటంతో జాబిల్లి కొంచెం పెద్దదిగా, సాధారణ సూపర్‌మూన్ కంటే మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సూపర్‌మూన్, సంపూర్ణ చంద్రగ్రహణం ఒకేసారి రావడం చాలా ప్రత్యేకమని రైస్ యూనివర్సిటీ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ప్యాట్రిక్ హార్టిగన్ తెలిపారు. 

ఈ గ్రహణం చాలాసేపు కొనసాగుతుందని, ప్రాంతాలను బట్టి గంట నుంచి మూడు గంటల వరకు గ్రహణం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. అయితే ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం భారతీయులకు లేదు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9 గంటల 5 నిమిషాల నుంచి (యూరోపియన్ కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10.34 నుంచి) భూగోళ నీడ చంద్రునిపై పడటం మొదలవడంతో పాక్షిక గ్రహణ దశ ఆరంభమవుతుంది. 10 గంటల 10 నిమిషాలకు (యూరోపియన్ కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11.41 నిమిషాలకు) చంద్రుడిని భూమి నీడ పూర్తిగా కమ్మేయడంతో సంపూర్ణత్వాన్ని సంతరించుకునే ఈ గ్రహణం 62 నిమిషాలపాటు కొనసాగుతుంది.

ఆకాశం నిర్మలంగా ఉంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, గ్రీన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్, ఐర్లాండ్, గ్రేట్ బ్రిటన్, నార్వే, స్వీడన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌తోపాటు స్పెయిన్ తీరప్రాంతాల్లో ఈ గ్రహణం పూర్తిస్థాయిలో దర్శనమిస్తుంది. యూరప్ ఖండంలోని మిగిలిన ప్రాంతాలతోపాటు ఆఫ్రికా ఖండంలో చంద్రాస్థమయానికి ముందు ఈ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. ఈ గ్రహణం సంపూర్ణత్వాన్ని సంతరించుకున్న తర్వాత భూమి వాతావరణంలోని సూర్యరశ్మి కారణంగా జాబిల్లి ఎరుపు వర్ణంలో కనిపిస్తుంది. అందువల్ల దీన్ని బ్లడ్ మూన్ అని, జనవరి మాసంలో ఏర్పడటం వల్ల ఉల్ఫ్ మూన్ లేదా గ్రేట్ స్పిరిట్ మూన్ అని కూడా అంటారు.