విరాట్‌  కోహ్లీకి అరుదైన గౌరవం

విరాట్‌  కోహ్లీకి అరుదైన గౌరవం

 దుబాయ్‌ : టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) మంగళవారం 2018కి గానూ అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన పురుషుల టెస్టు, వన్డే జట్లను మంగళవారం ప్రకటించింది. ఈ రెండు జట్లకు సారథ్య బాధ్యతలు సంపాదించాడు. మాజీ ఆటగాళ్లు, మీడియా, బ్రాడ్‌కాస్టింగ్‌ సభ్యులు ఉన్న ఐసిసి ఓటింగ్‌ అకాడమీ ద్వారా ఈ జట్లను ప్రకటించారు. టెస్టు జట్టులో భారత్‌, న్యూజిలాండ్‌ నుంచి ముగ్గురేసి ఆటగాళ్లు చోటు సంపాదించుకున్నారు. వన్డే జట్టులో భారత్‌ నుంచి కోహ్లీతో పాటు రోహిత్‌ శర్మ, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రాలు, ఇంగ్లాండ్‌ నుంచి జోరు రూట్‌, జాన్‌ బారిస్ట్రో, జాస్‌ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌ చోటు దక్కించుకున్నారు. కోహ్లీ తర్వాత రెండు జట్లలో చోటు సంపాదించుకున్న భారత ఆటగాడు పేస్‌ బౌలర్‌ బూమ్రా నిలిచాడు. 

'2018లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ చూపిన అద్భుత ప్రదర్శనకు గాను టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా అతని పేరును ప్రకటించాం' అని ఐసిసి ఒక ప్రకటనలో వెల్లడించింది. కోహ్లీ క్రికెట్‌ చరిత్రలో సర్‌ గారీఫీల్డ్‌ ట్రోఫీని రెండోసారి దక్కించుకున్న బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. కోహ్లీ గతేడాది 13 టెస్టుల్లో ఐదు శతకాలు నమోదు చేసి 55.08 సగటుతో మొత్తం 1,322 పరుగులు చేయగా.. 14 వన్డేల్లో ఆరు శతకాలతో మొత్తం 1,202 పరుగులు, పది టీ20 మ్యాచ్‌ల్లో 211 పరుగులు నమోదు చేశాడు. దీంతో మెజారిటీ ఓటర్లు రెండు జట్లకు కెప్టెన్‌గా కోహ్లీని ప్రతిపాదించారు. దీంతో పాటు 2018 సంవత్సరానికిగాను టెస్టు, వన్డేల్లో టాప్‌ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ ముగించాడు. 

ఐసిసి వన్డేజట్టు : రోహిత్‌శర్మ (ఇండియా), జాన్‌ బారిస్ట్రో(ఇంగ్లాండ్‌), విరాట్‌ కోహ్లీ (ఇండియా)(కెప్టెన్‌), రాస్‌ టేలర్‌ (న్యూజిలాండ్‌), జాస్‌ బట్లర్‌ (ఇంగ్లాండ్‌)(వికెట్‌కీపర్‌), బెన్‌ స్టోక్స్‌(ఇంగ్లాండ్‌), ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌(బంగ్లాదేశ్‌), రషీద్‌ఖాన్‌ (ఆఫ్ఘనిస్తాన్‌), కుల్దీప్‌ యాదవ్‌(ఇండియా), జస్ప్రీత్‌ బుమ్రా(ఇండియా). 
ఐసిసి టెస్టు జట్టు : టామ్‌ లూథమ్‌ (న్యూజిలాండ్‌), కరుణరత్నే(శ్రీలంక), కెన్‌ విలియమ్సన్‌(న్యూజిలాండ్‌), విరాట్‌ కోహ్లీ(ఇండియా)(కెప్టెన్‌), హెన్రీ నికోల్స్‌(న్యూజిలాండ్‌), రిషబ్‌ పంత్‌(ఇండియా)(వికెట్‌కీపర్‌), జాసన్‌ హోల్డర్‌(వెస్టిండీస్‌), కజిసో రబాడా(దక్షిణాఫ్రికా), నాథన్‌ లియాన్‌(ఆస్ట్రేలియా), జస్ప్రీత్‌ బుమ్రా(ఇండియా), మహ్మద్‌ అబ్బాస్‌(పాకిస్తాన్‌).