ఛెత్రీ సేనకు కఠిన పరీక్ష

ఛెత్రీ సేనకు కఠిన పరీక్ష

 అబుదాబి : ఎఎఫ్‌సి ఫుట్‌బాల్‌ టోర్నీలో భాగంగా భారత జట్టు గురువారం పటిష్ట యుఏఈతో తలపడ నుంది. టోర్నీలో భాగంగా ఆదివారం థాయ్‌లాండ్‌తో తలపడిన ఛెత్రీ సేన 4-1తో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గ్రూప్‌లోనే ఉన్న యుఏఈ- బహ్రెయిన్‌ల మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ గ్రూప్‌లో ఉన్న భారత్‌ మూడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, యుఏఈ, బహ్రెయిన్‌ జట్లు ఒక్కో పాయింట్‌తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దీంతో నేడు భారతజట్టుతో తలపడే యుఏఈకు ఈ మ్యాచ్‌ కీలకం కానుంది. 

తొలిమ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై సంచలన విజయం సాధించిన ఛెత్రీ సేన మంచి ఊపుమీదుంది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్‌కంటే మెరుగైన స్థానంలో ఉన్న యుఏఈ జట్టు గెలుపు కత్తిమీద సాములాంటిదే. అదీగాక ప్రస్తుత టోర్నీకి యుఏఈ ఆతిథ్యమిస్తోన్న కారణంగా స్వంత అభిమానుల మధ్య ఫేవరేట్‌ రెట్టించిన ఉత్సాహంతో ఆడే అవకాశమూ లేకపోలేదు. ఈ మ్యాచ్‌లో భారత నిలువరిస్తేనే ముందుకెళ్లే అవకాశముంది. ఇప్పటివరకూ ఇరుజట్లు ముఖాముఖి 11సార్లు తలపడగా ఎనిమిదిసార్లు యుఏఈజట్టు గెలుపొందగా, భారత్‌ రెండు మ్యాచుల్లో మాత్రమే విజయాన్ని సాధించగల్గింది. మరో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. కోచ్‌ స్టెఫెన్‌ పర్యవేక్షణలోని ఛెత్రీసేన థాయ్‌లాండ్‌తో ఆడిన తొలిమ్యాచ్‌ తొలి అర్ధభాగాన్ని 1-1 గోల్స్‌తో ముగించింది. కానీ రెండో అర్ధభాగంలో రెట్టించిన ఉత్సాహంతో మరో మూడు గోల్స్‌ చేసి 4-1తో మ్యాచ్‌ను ముగించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ విజయంతో టీమిండియాక మూడు పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. సునీల్‌ ఛెత్రీ సారథ్యంలోని ఇండియా బ్లూ జట్టు నేటి మ్యాచ్‌లో గెలిస్తే నాకౌట్‌కు చేరే అవకాశముంది. ప్రస్తుత భారత ఫుట్‌బాల్‌ జట్టు గత 13 మ్యాచుల్లో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తోంది. థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ రెండు గోల్స్‌ నమోదుచేసి అంతర్జాతీయ గోల్స్‌ సంఖ్య 67కు చేరుకున్నాడు. దీంతో అర్జెంటీనా ఆటగాడు లియోనెల్‌ మెస్సీ (65 గోల్స్‌)ను ఛెత్రీ వెనక్కి నెట్టాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్‌ ఆడుతున్న ఆటగాళ్ల జాబితాలో అత్యధిక గోల్స్‌ చేసిన పోర్చుగల్‌ సంచ లనం క్రిస్టియానో రోనాల్డో (85 గోల్స్‌) తర్వాతి స్థానంలో ఛెత్రీ నిలిచిన సంగతి తెలిసిందే.