పెరుగుతున్న మెట్రో ప్రయాణికులు

పెరుగుతున్న మెట్రో ప్రయాణికులు

 హైదరాబాద్ : మెట్రోరైలు ప్రయాణికుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నది. హైదరాబాద్ నగర ప్రయాణంలో మెట్రోరైలు అంచనాలకు మించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ కీలకంగా మారుతున్నది. ఫ్రీక్వెన్నీతోపాటు వాటి వేగం కూడా పెరుగడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రోరైలును ఎంచుకుంటున్నారు. నిత్యం 80 వేల మంది మెట్రోలో ప్రయాణిస్తుండగా, గత శనివారం ఈ సంఖ్య 91 వేలకు చేరుకోగా(మెట్రో ఉద్యోగులతో కలిపి ప్రయాణికుల సంఖ్య లక్ష దాటింది), సోమవారం 84 వేల మంది(ఉద్యోగులతో కలిపి 93,452) ప్రయాణించారు. 

మూడు నెలలుగా ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే స్టేషన్ల విషయానికి వస్తే కూకట్‌పల్లిహౌసింగ్ బోర్డు మెట్రోస్టేషన్ మొదటిస్థానంలో నిలుస్తుండగా, కేపీహెచ్‌బీ స్టేషన్‌ను మియాపూర్, జేఎన్టీయూ, నాగోల్, ఉప్పల్ స్టేషన్లు ఇటీవల దీనిని అధిగమిస్తున్నాయి. సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్‌లో స్కైవాక్ నిర్మిస్తే ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే స్టేషన్‌గా రికార్డులోకెక్కనున్నది. ఈ స్కైవే మూడు నెలల్లో పూర్తికానున్నది. నాగోల్ నుంచి మియాపూర్ వరకు గల 24 స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తున్నవారి గణాంకాలను మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.