‘సభామర్యాదలను కాపాడుదాం’

‘సభామర్యాదలను కాపాడుదాం’

  హైదరాబాద్ : సభ్యుల సహకారంతో తెలంగాణ శాసనసభ వ్యవహారాలను దేశానికే ఆదర్శంగా ఉండేలా నిర్వహిస్తా. గవర్నర్ ప్రసంగం రాష్ట్రప్రభుత్వ పరిపాలనకు దర్పణం పట్టేలా ఉన్నది. ఫిరాయింపులపై చట్టప్రకారమే చర్యలు తీసుకుంటాం.సభ్యులుగా సభా సంప్రదాయాలు, మర్యాదలను కాపాడుదాం. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కృషిచేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు అని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 

స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆదివారం అసెంబ్లీ కమిటీహాల్‌లో శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ రాష్ట్రానికి ఉన్నతమైన సభ అని, రాష్ట్ర ప్రగతి, పేద ప్రజల అభ్యున్నతికి, రైతాంగం శ్రేయస్సు కోసం ఫలప్రదమైన చర్చలు జరుపుకొని వారి ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని చెప్పారు. ఏ పార్టీకి చెందినవారైనా సభాగౌరవాన్ని కాపాడాలని, సమావేశాల సందర్భంగా సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయశాఖమంత్రిగా పనిచేశానని, నాలుగున్నరేండ్లలో తెలంగాణ వ్యవసాయశాఖ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.

దేశంలో అందరూ తెలంగాణలో వ్యవసాయం, రైతుబంధు, రైతు బీమా పథకాల గురించే మాట్లాడుతున్నారని చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డు తీసుకున్న సమయంలో తెలంగాణ వ్యవసాయరంగం గురించి తాను మాట్లాడుతుంటే.. ఇన్ని పనులు చేపట్టారా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, సభ్యుల సహకారంతో శాసనసభనూ దేశంలో ఆదర్శంగా నిలిపేలా కృషిచేస్తానని చెప్పారు. శాసనసభలో ప్రతినిమిషం, ప్రతి మాటా చాలా విలువైనవని, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి సభా సమయాన్ని వృథా కానీయొద్దని కోరారు. దేశంలో అన్నింట్లోనూ నంబర్‌వన్‌గా ఉన్నాం.. శాసనసభా వ్యవహారాల్లోనూ నంబర్‌వన్‌గా ఉందామని అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో శాసనసభా వ్యవహారాలైనా నిర్వహించుకోగలరా? అంటూ పలువురు వ్యంగాస్ర్తాలు సంధించారని, కానీ నేడు దేశంలోనే ఉత్తమంగా సభను నడిపించుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ప్రగతికి మీడియా సహకారం కూడా అవసరమని కోరారు.