ట్రంప్‌ తిరస్కృతి

ట్రంప్‌ తిరస్కృతి

  క్యూబెక్‌: జి-7 కూటమి సంయుక్త ప్రకటన నుంచి అమెరికా బయటకు వెళ్లిపోయింది. రెండు రోజుల పాటు ఇక్కడ జరిగిన ఈ సంపన్న దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం వాణిజ్యంపై తగాదాను పరిష్కరించకపోగా మరింత పెంచింది. దీనికి అమెరికాయే కారణమని కూటమిలోని ఇతర దేశాలు విమర్శించగా, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడూ తప్పుడు ప్రకటనలే ఈ పరిస్థితికి కారణమని అమెరికా ఆరోపించింది. సంయుక్త ప్రకటనకు జి-7 దేశాలు అంగీకరించాయని ఈ సదస్సుకు ఆతిధ్యమిచ్చిన కెనడా ప్రధాని ట్రూడూ ప్రకటించిన కొద్ది సేపటికే ఈ ప్రకటనకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

కెనడియన్‌ ప్రధాని బలహీనుడు, నిజాయితీలేని వ్యక్తి అంటూ ఘాటైన వ్యాఖ్యలతో ట్వీట్లు మీద ట్వీట్లు చేశారు. సంయుక్త ప్రకటన స్వేచ్ఛ, న్యాయమైన వాణిజ్యానికి ప్రాముఖ్యమివ్వాలని నొక్కి చెప్పడం వల్లే ట్రంప్‌ దీనిని వ్యతిరేకించారని ఈ కూటమిలోని ఇతర దేశాలు విమర్శించాయి. మే31న ట్రంప్‌ ఇయు, కెనడా, మెక్సికోలపై ఉక్కు, అల్యూమినియం సుంకాలు విధించడంపై కెనడా ప్రధాని ఈ సదస్సులో తీవ్రంగా స్పందించారు. ట్రంప్‌ చర్యకు ప్రతీకార చర్యలు జులై 1 నుంచి అములు చేస్తామని కెనడా ప్రధాని ప్రకటించడంపై ట్రంప్‌ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అనుకున్నదానికన్నా ముందుగానే క్యూబెక్‌ నుంచి సింగపూర్‌కు ఆయన బయల్దేరి వెళ్లారు. సింగపూర్‌లో ఈ నెల12 న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో ట్రంప్‌ సమావేశం కానున్న సంగతి తెలిసిందే.