మహీంద్రా కేయూవీ 100 అప్‌డేటెడ్ వెర్షన్‌

మహీంద్రా కేయూవీ 100 అప్‌డేటెడ్ వెర్షన్‌

 ముంబై: యుటిలిటీ వాహన తయారీలో అగ్రగామి సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. కాంప్యాక్ట్ ఎస్‌యూవీ కేయూవీ100 అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ముంబై షోరూంలో ఈ కారు రూ.4.39-7.33 లక్షల మధ్యలో లభించనున్నది. దీంట్లో పెట్రోల్ వెర్షన్ రూ.4.39 లక్షల నుంచి రూ.6.04 లక్షల మధ్యలో, డీజిల్ వెర్షన్ రూ.5.39 లక్షల నుంచి రూ.7.33 లక్షల మధ్యలో లభించనుంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి 2020 నుంచి బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన వాహనాలను మాత్రమే విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా మహీంద్రా తన దిశను మార్చుకుంటున్నది. 

2020 ఏప్రిల్ నుంచి అన్ని రకాల వాహనాలను పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించనున్నట్లు మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ఆయన స్పందిస్తూ..ప్రస్తుతం వీటిపై ఎలాంటి స్పష్టత లేదని, భవిష్యత్తులో వేటికి డిమాండ్ ఉంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహన సెగ్మెంట్‌లో 20 శాతం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కంపెనీ ప్రణాళికలో భాగంగా వచ్చే ఏడాది కల్లా కేయూవీ 100ని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో సైతం విడుదల చేసే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.