మార్కెట్‌లోకి ఎలక్ట్రికల్ గేర్‌లెస్ ఆటోలు

మార్కెట్‌లోకి ఎలక్ట్రికల్ గేర్‌లెస్ ఆటోలు

  జనగామ: గుడ్‌లక్ వెహికిల్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మేడిన్ జనగామ బ్రాండ్‌గా గేర్‌లెస్ ఆటోలు శుక్రవారం మార్కెట్లోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జనగామ మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై ఆటోలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ ఎండీ పెద్ది శరత్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తయారు చేసిన గేర్‌లెస్ ఎలక్ట్రికల్ ఆటోలు ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేందుకు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు, కిరాణా, వాణిజ్య వ్యాపారాలకు ఉపయోగపడేలా నూతన టెక్నాలజీని ఉపయోగించి, అన్ని హంగులతో తయారు చేసినట్లు తెలిపారు.


లండన్‌లో చదువుకొన్న తాను కొంతమందికి ఉపాధి కల్పించాలని సంకల్పంతో కొన్ని రోజులుగా చైనా దేశపు సాంకేతిక పరిజ్ఞానంతో జనగామలో గుడ్‌లక్ సంస్థ పేరుతో ఎలక్ట్రికల్ ఆటోల తయారీ సంస్థను నెలకొల్పినట్లు చెప్పారు. ప్యాసింజర్ ఆటోలో నలుగురు ప్రయాణికులు, డ్రైవర్‌తో పాటు లగేజీ పెట్టుకునే అవకాశం ఉందన్నారు. ప్రారంభం రోజే వివిధ ప్రాంతాలకు చెందిన 25 మంది డీలర్‌షిప్ తీసుకున్నట్లు చెప్పారు. మరో రెండు నెలల్లో తమ ఆటోల విక్రయాలను దేశ వ్యాప్తంగా విస్తరింపజేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో కంపెనీ డైరెక్టర్ పెద్ది రవీందర్, హార్టి కల్చర్ ఆఫీసర్ కేఆర్ లత, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.