మార్కెట్లోకి లెక్సస్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ కార్‌

మార్కెట్లోకి లెక్సస్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ కార్‌

  న్యూఢిల్లీ: జపాన్‌ కంపెనీ టయోటాకు చెందిన లగ్జరీ కార్ల విభాగం లెక్సస్‌.. అంతా కొత్తదైన హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ కారును భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈఎస్‌ 300హెచ్‌ పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.59.13 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) నిర్ణయించామని లెక్సస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ పీబీ వేణుగోపాల్‌ తెలిపారు.  

జూలైలోనే బుకింగ్‌లు...
ఈ ఏడో తరం ఈఎస్‌ 300హెచ్‌ను 2.5 లీటర్, నాలుగు సిలిండర్‌  పెట్రోల్‌ ఇంజిన్‌తో, 44 వోల్ట్, 204 సెల్‌ నికెల్‌ లోహ హైబ్రిడ్‌ బ్యాటరీతో రూపాందించామని వేణుగోపాల్‌ వివరించారు. ఒక్క లీటర్‌కు ఈ కారు 22.37 కిమీ. మైలేజీని ఇస్తుందని పేర్కొన్నారు.  పది ఎయిర్‌బ్యాగ్‌లతో సహా  వెహికల్‌ స్టెబిలిటీ కంట్రోల్,   హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్, యాంటీ థెఫ్ట్‌ సిస్టమ్, టిల్ట్‌ సెన్సర్లు వంటి  అత్యంత అధునిక భద్రతా ఫీచర్లున్నాయని వివరించారు.

స్లిమ్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ షేప్‌ మార్కర్‌ లైట్లు, ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్స్, 17 స్పీకర్‌ మార్క్‌ లెవిన్సన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, 7–అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, 12.3 అంగుళాల సెంటర్‌ కన్సోల్‌(ఈ కన్సోల్‌పై క్లైమేట్, ఆడియో కంట్రోల్స్‌ ఉన్నాయి), అడ్జెస్టబుల్‌ సీట్లు వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఈ కార్లకు జూలైలోనే బుకింగ్‌లు ప్రారంభించామని, సెప్టెంబర్‌ చివరి వారంలో గానీ, అక్టోబర్‌ మొదటి వారం నుంచి గానీ డెలివరీలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కారు మెర్సిడెస్‌–బెంజ్‌ ఈ–క్లాస్, బీఎమ్‌డబ్ల్యూ 5–సిరీస్, ఆడి ఏ6 కార్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.