బ్యాంకింగ్‌ వ్యవస్థ బలోపేతానికి చర్యలు

బ్యాంకింగ్‌ వ్యవస్థ బలోపేతానికి చర్యలు

  న్యూఢిల్లీ : బ్యాంకింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ పార్లమెంటరీ ప్యానెల్‌కు హామీ ఇచ్చారు. పారు బకాయిలు, బ్యాంక్‌ అవినీతి కుంభకోణాలు, నగదు సంక్షోభం, ఇతర అంశాలపై ప్యానెల్‌ నుండి గవర్నర్‌ కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు. నిరర్ధక ఆస్తులకు సంబంధించి తలెత్తిన ఈ సంక్షోభాన్ని అధిగమించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని కమిటీ సభ్యులు కొందరు మాట్లాడుతూ, ఇటీవల కాలంలో కొన్ని ఎటిఎంల్లో నగదు లేకపోవడాన్ని ప్రస్తావించారు.

బ్యాంకింగ్‌ కుంభకోణాలను అదుపు చేసేందుకు తగు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయనను ప్రశ్నించారు. దివాళా నిబంధనావళిని (ఐబిసి) అమలు చేసిన తర్వాత నిరర్ధక ఆస్తులకు సంబంధించి పరిస్థితి మెరుగుపడిందని పటేల్‌ చెప్పారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో పేరుకుపోతున్న నిరర్ధక ఆస్తుల గురించి, ఆర్‌బిఐ పర్యవేక్షక వ్యవస్థపై కమిటీకి అనేక సందేహాల తలెత్తుతున్నాయని టిఎంసి నేత, కమిటీ సభ్యుడు దినేష్‌ త్రివేది చెప్పారు.