హిడెన్ చార్జీలు వేసిన ఎస్‌బీఐపై కేసు

హిడెన్ చార్జీలు వేసిన ఎస్‌బీఐపై కేసు

  చర్లపల్లి : అనుమతి లేకుండా వినియోగదారుడి ఖాతా నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులను చార్జీల పేరు(హిడెన్ చార్జీలు)తో అకౌంట్ నుంచి కట్ చేస్తున్న బ్యాంకుపై కోర్టు ఆదేశాల మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ప్రగతినగర్‌కు చెందిన కృష్ణమోహన్ శర్మ స్థానికంగా పౌరహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 


ఇతనికి ఏఎస్‌రావునగర్ ఎస్‌బీఐ బ్రాంచిలో సేవింగ్ ఖాతా ఉంది. కాగా.. ఈ నెల మొదటి వారంలో చార్జీల పేరుతో అకౌంట్ నుంచి రూ.150లు కట్ కావడంతో వెంటనే బ్యాంకు అధికారులను అడుగగా.. స్టేట్‌మెంట్ తీసుకున్నందుకు ఫీజ్ కింద కట్ చేశామని తెలిపారు. అయితే తాను ఎలాంటి స్టేట్‌మెంట్ తీసుకోలేదని ఖాతాదారుడు చెప్పినా బ్యాంకు అధికారులు పొంతనలేని సమధానం చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 

దీంతో వెంటనే వినియోగదారుడు ఉన్నతాధికారులకు , ఆర్‌బీఐ అధికారు ల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో మల్కాజిగిరి కోర్టులో ప్రైవేట్ పిటీషన్ వేశాడు. దీంతో కేసు స్వీకరించిన కోర్టు బ్యాంకుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నివేదికను అందించాలని పోలీసులకు సూచించింది. ఈ మేరకు పోలీసులు ఏఎస్‌రావునగర్ ఎస్‌బీఐ బ్యాంకుపై ఐపీసీ 405, 406, 409 సెక్షన్‌ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.