ఇస్లామిక్ బ్యాంకింగ్ యోచన లేదు

ఇస్లామిక్ బ్యాంకింగ్ యోచన లేదు

 న్యూఢిల్లీ : దేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను ఆర్బీఐ ఉపసంహరించుకుంది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ప్రకారంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్బీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ప్రతినిధి ఈ విషయంలో పురోగతిని తెలియపర్చాలంటూ ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా ఆర్బీఐకి వినతి పత్రం సమర్పించారు. ఇందుకు ఆర్బీఐ బదులిస్తూ.. దేశంలోని ప్రజలందరికీ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు విస్తృతంగా, సమానంగా అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇస్లాం బ్యాంకింగ్ ఏర్పాటు ప్రతిపాదనను మరింత ముందుకు తీసుకెళ్లవద్దని నిర్ణయం తీసుకున్నాం అని తెలిపింది. 

షరియత్ సూత్రాలకు అనుగుణంగా ఏర్పాటు చేసే బ్యాంకింగ్ సేవల విధానమే ఇస్లామిక్ లేదా షరియా బ్యాంకింగ్. ఇస్లాంలో డబ్బుకు విలువ లేదు. కాబట్టి డబ్బుతో లాభం ఆపేక్షించరాదు. షరియత్ చట్టాల ప్రకారం.. పరిమిత కాలానికి తీసుకునే అప్పుపై వడ్డీ చెల్లించడం నిషేధం. అంతేకాదు, ఇస్లాం సూత్రాలకు విరుద్ధమైన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా నిషేధమే. ఆగస్టు 28, 2014న ప్రధాని మోదీ జన్ ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలోని పేదలను సైతం బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తీసుకురావడం, దేశంలోని అన్ని కుటుంబాలకు బ్యాంకింగ్ సేవల సదుపాయాన్ని కల్పించడమే ఈ పథకం ముఖ్యోద్దేశం. 


ఆర్థిక సేవల రంగంలో సంస్కరణలపై 2008లో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వం వహించిన ఆ కమిటీ.. దేశంలో వడ్డీరహిత బ్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించింది. కొన్ని మత ఆచారాలు ముడిపడి ఉన్న ఆర్థిక లావాదేవీలను నిషేధించాయి. వడ్డీ రహిత బ్యాంకింగ్ విధానం అందుబాటులో లేకపోవడం వల్ల భారత్‌లోనూ అలాంటి మతాచారాలను తూ.చ తప్పకుండా పాటించే కొందరు ప్రస్తుత సంప్రదాయక బ్యాంకింగ్ సేవలను ఉపయోగించు కోలేకపోతున్నారు అని కమిటీ పేర్కొంది.

ఆ తర్వాత వడ్డీ రహిత బ్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చట్టపరంగా, సాంకేతికంగా, నియమావళి ప్రకారంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్బీఐ ఇంటర్ డిపార్ట్‌మెంటల్ గ్రూప్‌ను(ఐడీజీ) ఏర్పాటు చేసింది. ఆ గ్రూపు సమర్పించిన నివేదికను ఆర్బీఐ గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక శాఖకు పంపింది. షరియా బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టే కంటే ముందు సంప్రదాయక బ్యాంకుల్లోనే ప్రత్యేకంగా ఇస్లామిక్ విండోను ఏర్పాటు చేయాలని ఐడీజీ ప్రతిపాదించింది.