కొటక్ చేతికి యాక్సిస్ బ్యాంక్?

కొటక్ చేతికి యాక్సిస్ బ్యాంక్?

  న్యూఢిల్లీ: త్వరలో యాక్సిస్ బ్యాంక్‌ను కొటక్ మహీంద్రా బ్యాంక్ సొంతం చేసుకోబోతోందా?.. అందుకు ఇదే మంచి సమయం అంటున్నది నొమురా. యాక్సిస్ బ్యాంక్‌ను కొనేయడానికో, విలీనం చేసుకోవడానికో కొటక్ మహీంద్రాకు ఇప్పుడున్న పరిస్థితులు చాలా అనుకూలమంటూ.. మంచి తరుణం మించిన దొరకదని సలహా ఇస్తున్నది ఈ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ. అయితే దీనిపై నేరుగా స్పందించేందుకు కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్ నిరాకరించారు. 

దీంతో యాక్సిస్ బ్యాంక్ కొనుగోలుపై వస్తున్న వార్తలకు బలం చేకూరుతున్నది. దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ మూడో అతిపెద్ద బ్యాంకవగా, కొటక్ మహీంద్రా నాలుగో స్థానంలో ఉన్నది. ఇప్పటికే కొటక్.. ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ ఏకీకృత నికర లాభం గతంతో పోల్చితే 27 శాతం పెరిగి రూ.1,789 కోట్లుగా నమోదైంది. ఆస్తుల్లోనూ స్వల్ప పెరుగుదల కనిపించింది. మరోవైపు ఇదే త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ రూ.2,188.74 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఆస్తులు కూడా భారీగానే తరిగిపోయాయి. ఈ నేపథ్యంలో యాక్సిస్‌ను చేజిక్కించుకోవడానికి కొటక్‌కు ఇదే సరైన సమయమని నొమురా అభిప్రాయపడుతున్నది. 


పైగా సీఈవో శిఖా శర్మ వ్యవహారం యాక్సిస్‌ను ఒకింత దెబ్బతీసింది కూడా. శిఖా పదవీకాలాన్ని మరోసారి పొడిగించడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యంపై అక్షింతలు వేసిన సంగతి విదితమే. ఫలితంగా యాక్సిస్ బ్యాంక్‌తో శిఖా సుదీర్ఘ అనుబంధానికి ఈ ఏడాది ఆఖరుతో తెరపడనున్నది. దీంతో కొత్త సీఈవో కోసం అన్వేషణ మొదలైంది. ఈ ఒత్తిడిని ఎదుర్కొంటున్న యాజమాన్యానికి మందగించిన బ్యాంక్ పనితీరు మరింత తలనొప్పిగా మారింది. అంతేగాక ప్రస్తుత దేశీయ బ్యాంకింగ్ రంగ సంక్షోభం కూడా కలవరపాటుకు గురిచేస్తున్నది. ఓవైపు ప్రమాదకర స్థాయిలో మొండి బకాయిలు, మరోవైపు వరుసగా వెలుగుచూస్తున్న కుంభకోణాలు, మోసాలు, రుణ ఎగవేతలు బ్యాంకులపైనున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి.

ఈ క్రమంలో యాక్సిస్ బ్యాంక్‌ను అందిపుచ్చుకోవడానికి కొటక్ మహీంద్రాకు ఇంతకన్నా మంచి అవకాశం మళ్లీ రాదంటున్నది నొమురా. బ్లూంబర్గ్ నివేదిక కూడా యాక్సిస్ బ్యాంక్ టేకోవర్‌పై ఓ అంచనా వ్యక్తం చేసింది. భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమ చరిత్రలో అత్యంత ప్రీతిపాత్రమైన డీల్‌లలో యాక్సిస్ బ్యాంక్ కూడా ఒకటి కావచ్చన్నది. మొత్తానికి కొటక్ చేతికి యాక్సిస్ వస్తే రుణాలు, శాఖలపరంగా దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఆవిర్భవించనున్నది. ప్రస్తుతం కొటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ విలువ రూ.2.3 లక్షల కోట్లుగా ఉంటే, యాక్సిస్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.1.32 లక్షల కోట్లుగా ఉన్నది.