పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకులో రుణాలు

పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకులో రుణాలు

 న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు సేవల విస్తరణలో భాగంగా బ్యాంకులు, ఇతర విత్త సంస్థలతో భాగస్వామ్యం కుదర్చుకోనుంది. ఇలా థర్డ్‌ పార్టీతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా తమ ఖాతాదారులకు రుణాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా పథకాలను విక్రయించనుంది. ఐపిపిబి సేవలు ప్రారంభం అయిన తర్వాత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు చెందిన రుణాలతో పాటు కొన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తేనుందని సమాచారం. అదే విధంగా బజాజ్‌ అలయంజ్‌తో భాగస్వామ్యం కావడం ద్వారా బీమాతో పాటు మరిన్ని పథకా లను విక్రయించనుందని ఉన్నతాధికారి ఒక్కరు తెలిపారు. 

వచ్చే ఆగస్టు 21న ప్రధానీ నరేంద్ర మోడీ ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు (ఐపిపిబి)కు సంబంధించిన 650 శాఖలను లాంచనంగా ప్రారంభించనున్నారు. దీంతో మరో పెద్ద బ్యాంకింగ్‌ సేవల సంస్థ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం భారత్‌లో 1.55 లక్షల పోస్టు ఆఫీసు కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి ఈ శాఖలతో ఐపిపిబి అనుసంధానం కానుంది. ఇందులోనూ 1.3 లక్షల పోస్టు ఆఫీసులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇవి పక్క గ్రామాలను కూడా చేరుకోగలవని, దీంతో దేశంలోని అన్ని గ్రామాల్లో ఐపిపిబి సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆ అధికారి తెలిపారు.
 

ఇప్పటికే రారుపూర్‌, రాంచీలో రెండు ఐపిపిబి శాఖలు పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా విజయవంతంగా సేవలందిస్తున్నాయి. పేమెంట్‌ బ్యాంకులు వ్యక్తులు, చిన్న సంస్థల నుంచి లక్ష రూపాయల వరకు డిపాజిట్లు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇతర బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయొచ్చు. ఇతర అన్ని రకాల బ్యాంకింగ్‌ సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అయితే రుణాలు ఇవ్వడం, క్రెడిట్‌ కార్డులను జారీ చేసే అధికారం ఉండదు. దీంతో ఇతర బ్యాంకులు, విత్త సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు తమ ఖాతాదారులకు రుణాలు, ఇతర విత్త సేవలు అందించడానికి వీలు కల్పించనుంది.
 

లక్ష రూపాయల పరిమితి మించిన డిపాజిట్లను పోస్టు ఆఫీసు సేవింగ్‌ బ్యాంక్స్‌ (పిఒఎస్‌బి)కు బదిలీ చేయనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. పోస్టు ఆఫీసుల్లో రకరకాలైన 37 కోట్ల ఖాతాలు ఉన్నాయని, క్రమంగా వాటిని ఐపిపిబితో అనుసం ధానం చేయనున్నామని అన్నారు. తొలుత 11,000 మంది పోస్టుమాన్‌లు ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలను అందించ నున్నారు. ఆ తర్వాత 3 లక్షల తపాల శాఖ ఉద్యోగులు ఈ సేవల్లో భాగస్వాములు అవుతారు. ఇంటి వద్దకే అందించే సేవలకు కొంత రుసం వసూలు చేయనున్నారు.