సమ్మెలో 10లక్షల మంది బ్యాంక్‌ ఉద్యోగులు

సమ్మెలో 10లక్షల మంది బ్యాంక్‌ ఉద్యోగులు

 న్యూఢిల్లీ : మంగళవారం జరిగిన సార్వత్రిక సమ్మెలో పది లక్షల మంది బ్యాంక్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించిన డిమాండ్ల సాధనకు అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సమాఖ్య (ఎఐబిఇఎ), భారత బ్యాంక్‌ ఉద్యోగుల సమాఖ్య (బిఇఎఫ్‌ఐ)లు సంయుక్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆర్‌ఆర్‌బి, కేంద్ర సహకార బ్యాంకుల ఉద్యోగులు, ఆఫీసర్లు కూడా రెండు రోజుల పాటు సమ్మెలో పాల్గొంటున్నారని బిఇఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ బిశ్వాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సమ్మెకు ఎఐబిఓసి, ఎఐబిఓఎలు మద్దతు తెలిపాయి. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక ఆర్థిక విధానాలను, బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలను వ్యతిరేకించాలని ఆయన, ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రభుత్వ ఈక్విటీ వాటాలను కుదించడానికి చేస్తున్న యత్నాలను తిప్పికొట్టాలని బ్యాంకింగ్‌ యూనియన్లు పిలుపిచ్చాయి. బ్యాంకులను విలీనం చేయడాన్ని, సంఘటితం చేయడాన్ని, బ్యాంకుల్లో శాశ్వత ఉద్యోగాలను కాంట్రాక్టుపరం చేయడాన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. తక్షణమే ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని, తగిన రీతిలో రిక్రూట్‌మెంట్‌లు చేపట్టాలని యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి.