ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్!

ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్!

 న్యూఢిల్లీః స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు కాస్త ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఖాతాల్లో కనీస నిల్వలు పాటించని కస్టమర్లకు విధించే చార్జీలను తగ్గించింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటివరకు నెలకు రూ.50గా ఉన్న చార్జీలను ఇప్పుడు రూ.15కు తగ్గించింది. ఇక సెమీ అర్బన్, రూరల్ సెంటర్లలో ఈ చార్జీలను రూ.40 నుంచి రూ.12, రూ.10కి తగ్గించింది. కొత్త చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 

సేవింగ్స్ అకౌంట్లలో నెలవారీ సగటు బ్యాలెన్స్‌ను ఉంచకపోతే పెనాల్టీ వేస్తున్న విషయం తెలిసిందే. ఇది మెట్రోల్లో రూ.3 వేలు, సెమీ అర్బన్‌లో రూ.2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యిగా ఉంది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ మంత్లీ యావ‌రేజ్‌ బ్యాలెన్స్ చార్జీలను ఎస్‌బీఐ వసూలు చేస్తున్నది. ఇలా పెనాల్టీల ద్వారా ఎస్‌బీఐకి భారీగా ఆదాయం వస్తున్నదన్న వార్తలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో చార్జీలను తగ్గించాలన్న నిర్ణయం తీసుకున్నది. రెండో త్రైమాసికంలో బ్యాంక్ ఆర్జించిన లాభాల కన్నా.. ఇలా చార్జీల ద్వారా వచ్చిన ఆదాయమే ఎక్కువన్న వార్తలు ఎస్‌బీఐపై తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చింది.