ఎస్‌బీఐ డిపాజిట్లపై వడ్డీరేట్ల పెంపు

ఎస్‌బీఐ డిపాజిట్లపై వడ్డీరేట్ల పెంపు

  న్యూఢిల్లీ : బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మరోసారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. గడిచిన మూడు పర్యాయాలు పరపతి సమీక్షలో రిజర్వుబ్యాంక్ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ నెల రోజుల కింద డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచిన ఎస్‌బీఐ.. తాజాగా మరోసారి 25 బేసిస్ పాయింట్ల వరకు సవరించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడాది నుంచి రెండేండ్ల కాలపరిమితి కలిగిన కోటి రూపాయల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లు 10-25 బేసిస్ పాయింట్లు పెరిగాయి. నూతన ఆర్థిక సంవత్సరానికిగాను తొలి పరపతి సమీక్షను ఏప్రిల్ 5న ఆర్బీఐ ప్రకటించడం కంటే ముందుగానే ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. రెండేండ్ల నుంచి మూడేండ్ల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 6.50 శాతం నుంచి 6.60 శాతానికి సవరించిన బ్యాంక్.. 3-5 ఏండ్లలోపు డిపాజిట్లపై 6.50 శాతం నుంచి 6.70 శాతానికి పెంచింది. 5-10 ఏండ్లలోపు డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీని వ్వనున్నది.