తగ్గిన ఎస్‌బిఐ మొండి బాకీలు

తగ్గిన ఎస్‌బిఐ మొండి బాకీలు

  ముంబయి : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) మొండి బాకీల్లో తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2) ఫలితాలను ఆ బ్యాంకు సోమవారం వెల్లడించింది. ఈ త్రైమాసికంలో బ్యాంకు లాభాలు 40.26 శాతం తగ్గి రూ.944.87 కోట్లుగా నమోదయ్యాయి. 2017-18 ఇదే క్యూ2లో రూ.1,581.55 కోట్ల లాభాలు సాధించింది. ఇదే సమయంలో 10.69 శాతంగా ఉన్న బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు (జిఎన్‌పిఎ) క్రితం క్యూ2లో 9.95 శాతానికి తగ్గాయి. కాగా నికర నిరర్ధక ఆస్తులు 5.29 శాతం నుంచి 4.84 శాతానికి దిగివచ్చాయి. 

క్రితం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మొండి బాకీల కోసం కేటాయింపులను 36.81 శాతం తగ్గించి రూ.12,092.17 కోట్లకు పరిమితం చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇందుకోసం రూ.19,137.43 కోట్ల కేటాయింపులు చేసింది. రుణ వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు నాణ్యతపై దృష్టి పెట్టే ఎత్తుగడలను తీసుకోవడంతో కేటాయింపులు భారాన్ని తగ్గించుకోగలిగామని ఎస్‌బిఐ ఎండి, సిఇఒ రజ్నీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. తమ బ్యాంకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు రూ.250 కోట్ల రుణం అందించిందని ఆయన మీడియాకు తెలిపారు. గత సెప్టెంబర్‌ త్రైమాసికంలో రుణ జారీలో రెండంకెల్లో 11.11 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. నికర వడ్డీపై ఆదాయంలోనూ మెరుగైన ప్రగతిని కనబర్చిందన్నారు. గృహ విత్త సంస్థలతో కలిపి బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్‌బిఎఫ్‌సి)లకు ఎస్‌బిఐ మొత్తంగా రూ.1.5 లక్షల కోట్ల నిధులు అందజేసిందన్నారు. మొండి బాకీలుగా తక్కువగా మారడంతో, అధిక రికవరీల వల్ల బ్యాంకు మొండి బాకీలు తగ్గాయన్నారు.