అన్ని పంచాయతీలకు హై-స్పీడ్ నెట్

అన్ని పంచాయతీలకు హై-స్పీడ్ నెట్

 న్యూఢిల్లీ: గ్రామీణులకూ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడానికి కేంద్రం తలపెట్టిన భారత్‌నెట్ రెండో దశ ప్రారంభమైంది. 2019 మార్చికల్లా దేశంలోని అన్ని పంచాయతీలు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం తప్పనిసరిగా కలిగి ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం.. భారత్‌నెట్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హాతోపాటు న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీలు సోమవారం ఈ రెండో దశ అమలును ప్రకటించారు. 

ఈ క్రమంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జీ టెలికం సేవల సంస్థ రిలయన్స్ జియో అత్యధికంగా రూ.13 కోట్ల ముందస్తు సబ్‌స్క్రిప్షన్ ఫీజును చెల్లించింది. తద్వారా 30,000 గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను జియో కల్పించనున్నది. ప్రాజెక్టు విస్తరణలో భాగంగా ప్రభుత్వం నుంచి ప్రతీ పంచాయతీలో బాండ్విడ్త్ కొనుగోలుకు కట్టుబడి ఉన్నామని జియో ఈ సందర్భంగా ప్రకటించింది. భారత్‌నెట్ నుంచి బాండ్విడ్త్ కొనుగోలుకు జీఎస్టీసహా రూ.13 కోట్లకుపైగా చెల్లింపులను మేము చేశాం. తొలుత 30,000 గ్రామ పంచాయతీలకు సేవలందిస్తాం. 


ఆపై సేవలను విస్తరిస్తూ వెళ్తాం. భారత్‌నెట్‌ను విస్తరించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములమవుతాం అని మనోజ్ సిన్హాకు చెక్కును అందించిన తర్వాత రిలయన్స్ జియో డైరెక్టర్ మహేంద్ర నహ్త అన్నారు. ఇక దేశీయ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ 30,500 గ్రామ పంచాయతీల కోసం బ్యాండ్విడ్త్‌కు రూ.5 కోట్లు చెల్లించింది. వొడాఫోన్ రూ.11 లక్షలు, ఐడియా సెల్యులార్ రూ.5 లక్షలను చెల్లించాయి. భారత్‌నెట్ ప్రాజెక్టులో భాగంగా బాండ్విడ్త్ ధరను 75 శాతం తగ్గించామని,బ్రాడ్‌బ్యాండ్ సేవలను చౌక ధరలకే అందించడానికి ఈ నిర్ణయం టెలికం ఆపరేటర్లకు దోహదపడుతుందని సిన్హా అన్నారు. ఈ ఏడాది ఆఖరుకల్లా భారత్‌నెట్ తొలి దశ ముగుస్తుందని చెప్పారు.

బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఇప్పటికే దేశంలోని 48 వేలకుపైగా గ్రామాల్లో మొదలయ్యాయి. మరో 75 వేలకుపైగా గ్రామాల్లో సేవలకు సర్వం సిద్ధమైందని మంత్రి సిన్హా తెలిపారు. కాగా, ఈ రెండో దశ కింద ప్రభుత్వం 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను అందించనుంది. 2011 అక్టోబర్‌లో అప్పటి యూపీఏ ప్రభుత్వం.. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ పేరుతో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. 3 లక్షల కిలోమీటర్ల మేర నెట్‌వర్క్ నిర్మాణాన్ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. వందల కిలోమీటర్లకే అది పరిమితమైంది. అయితే ప్రస్తుత మోదీ సర్కారు ఈ ప్రాజెక్టును వేగవంతం చేయగా, దానికి భారత్‌నెట్ అని పేరు మార్చింది. దేశంలోని సుమారు 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు 2019 మార్చికల్లా హై-స్పీడ్ నెట్‌ను ఈ ప్రాజెక్టు ద్వారా అందించాలనుకుంటుండగా, రెండు దశల వ్యయం రూ.42,000 కోట్లవుతుందని అంచనా.