కొచ్చర్‌పై వాటాదారుల ఆగ్రహం

కొచ్చర్‌పై వాటాదారుల ఆగ్రహం

  వడోదర : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ ఐసిఐసిఐ బ్యాంకు సిఇఒ చందా కొచ్చర్‌పై వాటాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోకాన్‌ రుణ కేసులో కొచ్చర్‌ క్విడ్‌ప్రోకోకు పాల్పడిందన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఐసిఐసిఐ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకోసం కొచ్చర్‌ను వార్షిక జనరల్‌ బాడీ సమావేశానికి పిలిపించాలని స్టాక్‌ హోల్డర్లు డిమాండ్‌ చేశారు. ఈ అంశంలో ఆమె వివరణ ఇవ్వాలని కోరారు. బోర్డు పారదర్శకంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. 

వీడియోకాన్‌ రుణ వివాద విచారణ పూర్తయ్యేంత వరకు కొచ్చర్‌ను సెలవులో కొనసాగించాలని ఆ బోర్డు ఇది వరకే నిర్ణయించింది. దీంతో బుధవారం జరిగిన 24వ వార్షిక సాధారణ సమావేశానికి హాజరు కాలేదు. కాగా ఐసిఐసిఐ బ్యాంక్‌ తన ఎజిఎంను ఆగస్టు 10నే చేపట్టాల్సి ఉంది. కానీ బ్యాంకు సిఇఒపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో స్వతంత్ర విచారణకు ఆదేశించేందుకు ఈ సమావేశాన్ని నెల పాటు వాయిదా వేసింది. ఐసిఐసిఐ బ్యాంకు నూతన చైర్మన్‌ చతుర్వేది ఆధ్వర్యంలో తొలిసారి ఈ సమావేశం జరిగింది. కొచ్చర్‌ కేసులో తమ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం దొరకడం లేదని వాటాదారుల మండిపడ్డారు. బ్యాంక్‌లో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదంటూ వాటాదారులు హెచ్చరించారు. తమ ముందుకు వచ్చి చందా కొచ్చర్‌ సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కొచర్‌ పనిని బోర్డు నిర్వహించలేదని పేర్కొన్నారు. 

చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కు లబ్ది చేకూరేలా క్విడ్‌ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసిఐసిఐ బ్యాంకు రుణం జారీచేసిట్టు ఆరోపణలు పెద్ద ఎత్తున్న వినిపిస్తున్నాయి. 2008లో వీడియోకాన్‌ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్‌ ధూత్‌, దీపక్‌ కొచ్చర్‌, మరో ఇద్దరు కలిసి న్యూపవర్‌ రెన్యువబుల్స్‌ సంస్థను ఏర్పాటు చేశారు. ఐసిఐసిఐ నుంచి రూ.3250 కోట్ల రుణం అందుకున్నారు. కొన్ని నెలలకే నూపవర్‌లోని రూ.64 కోట్ల విలువ చేసే షేర్లను కేవలం రూ.9 లక్షలకే దీపక్‌కు ఇచ్చేసి ఆయనకే అన్ని బాధ్యతలను అప్పగించేశారు. ఇందులో చందా కొచ్చర్‌ కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా ఆమె వ్యవహారించారని ప్రధాన ఆరోపణ. దీనిపై ఇప్పటికే సెబీ కూడా వివరణ కోరింది.