దిగివచ్చిన విమాన ఇంధన ధరలు

దిగివచ్చిన విమాన ఇంధన ధరలు

  న్యూఢిల్లీ: చుక్కలను అంటుతున్న చమురు ధరలతో నిర్వహణ వ్యయం పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోతున్న విమానయాన సంస్థలకు శనివారం గొప్ప ఊరట లభించింది. ప్రభుత్వ రంగపు ఇంధన సంస్థలు శనివారం న్యూఢిల్లీలో విమాన ఇంధన ధరలను దాదాపు 10.90 శాతం మేర తగ్గించాయి. దీంతో కిలోలీటరు విమాన ఇంధనం ధర రూ.8,327.83మేర తగ్గి రూ.68,050.97కు చేరినట్టుగా ఇంధన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. దేశ వ్యాప్తంగా ఆయా విమానాశ్రయాలలో స్థానిక పన్నులను బట్టి ఇంధన ధరల తగ్గుదల ఉంటుందని ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు తెలిపాయి. ప్రస్తుత తగ్గింపుతో కోల్‌కతాలో రూ.73,393.55కి, ముంబయిలో రూ.69,216.61కు తగ్గనున్నాయి. చమురు కంపెనీలు ప్రతి నెల అంతర్జాతీయ చమురు ధరలను పరిగణనలోకి తీసుకుంటూ విమాన ఇంధన ధరలను సవరిస్తూ వస్తుంటాయి. విమాన ఇంధన ధరలు పెరిగన నేపథ్యంలో ఇక విధిలేక చార్జీలను yంచేందుకు విమానయాన సంస్థలు సన్నాహాలు చేసుకుంటున్న వేళ ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ సంస్థల నుంచి కాస్త ఊరట లభించడంతో ఆయా సంస్థలు తమ ప్రణాళికలను తాత్కాలికంగా పక్కబెట్టినున్నట్టుగా విమానయాన రంగ విశ్లేషకులు చెబుతున్నారు.