ఇక ఎటిఎం వాడితే వాయింపు!

ఇక ఎటిఎం వాడితే వాయింపు!

  న్యూఢిలీ: ఖాతాదారులపై మరోమారు భారం మోపేందుకు గాను దేశంలోని బ్యాంకుల సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సర్‌ఛార్జీల పేరుతో కస్టమర్లపై భారం వేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇకపై బ్యాంకింగ్‌ సేవలపై జిఎస్‌టి ట్యాక్స్‌ను కూడా కస్టమర్లపైనే వేయాలని భావిస్తున్నాయి. ఖాతాల్లో కనీస నిల్వలను మేయిన్‌టెన్‌ చేస్తున్నవారికి అందించే ఉచిత సర్వీసుల మీద జిఎస్‌టి బాదుడుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. అంటే ఇప్పటి వరకు బ్యాంకులు కస్టమర్లకు అందించే సర్వీసులు రానున్న రోజుల్లో భారంగా మారనున్నాయి. ముఖ్యంగా చెక్‌ బుక్‌ జారీ, క్రెడిట్‌ కార్డ్‌ మంజూరు, ఎటిఎంల డెబిట్‌ కార్డు వాడకం, ఇంధన సర్‌ఛార్జ్‌ రీఫండ్స్‌ వంటి సేవలపై ప్రభుత్వం జిఎస్‌టి మోత విధించనున్నట్టుగా సమాచారం. తద్వారా దాదాపు రూ. 40,000 కోట్ల ట్యాక్స్‌, పెనాల్టీలను బ్యాంకుల నుండి ప్రభుత్వం రాబట్టేందుకు లెక్క సిద్ధం చేసి ఉంచినట్టుగా సమాచారం. 

వీటికి సంబంధించి రెండు నెలల క్రితం ట్యాక్స్‌ డిపార్ట్‌ మెంట్‌, బ్యాంకులు ఇస్తున్న ఉచిత సర్వీసులపై జిఎస్‌టిని విధిస్తూ బ్యాంకులకు నోటీసులను జారీ చేసింది. ఇప్పటికే లాభాలు కుంగి ఆర్థిక కష్టాల్లో ఉన్న బ్యాంకులు ప్రభుత్వం జిఎస్‌టి పేరుతో విధించిన భారీ భారాన్ని మోయలేమని చేతులెత్తేస్తున్నాయి. దీంతో విధిలేక ఆ పన్ను భారాన్ని నేరుగా ఖాతాదారులపైనే వేయాలని ఆయా బ్యాంకులు భావిస్తున్నట్టుగా సమాచారం. దీంతో ఎస్‌బిఐ, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి లాంటి బ్యాంకులు జిఎస్‌టి బాదుడుకు సిద్ధం కానున్నాయని ఎకనామిక్‌ టైమ్స్‌ ఒక రిపోర్డులో వెల్లడించింది. దీంతో దేశంలో ఉన్న అన్ని మేజర్‌ బ్యాంకులు 18 శాతం జిఎస్‌టి విధింపునకు తమ సమ్మతిని తెలియచేసినట్టుగా సమాచారం. అయితే ఎంత మొత్తంలో.. ఏ రూపంలో జిఎస్‌టి విధించాలన్నదానిపై ఆయా బ్యాంకులు తుది ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి.

ఇందులో చాలా బ్యాంకులు ఈ నెల రెండో వారం నుంచే జీఎస్‌టీ వడ్డనకు సిద్ధమవుతున్నాయని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ సిఇఒ కెజి కన్నన్‌ పేర్కొన్నారు. ఈ విధానం అమలైతే కస్టమర్ల పన్ను చెల్లింపులు నేరుగా ప్రభుత్వానికే వెళ్ళిపోతాయని అభిప్రాయపడ్డారు. సిజిఎస్‌టి చట్టం లోని షెడ్యూల్‌ 2 ప్రకారం ఇతర నాన్‌ బ్యాంకింగ్‌ రంగాల్లో కూడా జిఎస్‌టీ అమలుపై ఆదాయన పన్ను శాఖ కసరత్తులు చేస్తుంది. ఈ నోటీసులు అందుకున్న బ్యాంకుల్లో మల్టీనేషనల్‌ బ్యాంకులైన డిబిఎస్‌, సిటీబ్యాంక్‌ కూడా ఉన్నాయి. ఇప్పటికే బ్యాంకుల బాదుడుకు దిమ్మతిరిగి అటువైపు వేళ్లాలంటేనే జంకుతున్న సామాన్య మానవుడు ఏటీఎంతో సహా పలు సేవలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని యోచిస్తుండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు ఈ విషయమై మరోమారు పునరాలోచన జరపాలని వారు కోరుతున్నారు. బ్యాంకులకు నగదు లభ్యత కఠినంగా మారుతున్న వేళ బ్యాంకులు ఖాతాదారులను వీలైనంత గటిష్టంగా వివిధ చార్జీలను వసూలు చేయాలని భావిస్తున్నాయి.