ఇంటర్నెట్‌ తటస్థతకు టెలికాం కమిషన్‌ ఆమోదం

ఇంటర్నెట్‌ తటస్థతకు టెలికాం కమిషన్‌ ఆమోదం

 న్యూఢిల్లీ : ఇంటర్నెట్‌ తటస్థత (న్యూట్రాలటి) కోసం రూపొందించిన నిబంధనలకు టెలికాం కమిషన్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఇంటర్నెట్‌ కంటెంట్‌ను, సేవలను బ్లాక్‌ చేయడం, కుదించడం, కొన్ని సేవలకు మాత్రమే హై స్పీడ్‌ను మంజూరు చేయడం వంటి చర్యల ద్వారా ఇంటర్నెట్‌ సేవలందించడంలో సర్వీస్‌ ప్రొవైడర్లు వివక్షపూరితంగా వ్యవహరించే చర్యలను అడ్డుకునేందుకు ఈ నిబంధనావళిని రూపొందించారు. కొన్ని సంక్లిష్ట అనువర్తనాలు, రిమోట్‌ సర్జరీ, అటానమస్‌ కార్లు వంటి కొన్ని సేవలకు నెట్‌ తటస్థీకరణ నిబంధనావళి నుంచి మినహాయింపు ఇచ్చినట్లు టెలికాం కార్యదర్శి అరుణా సుందర్‌ రాజన్‌ ఇక్కడ విలేకరులకు తెలిపారు. 

ఫేస్‌బుక్‌ ఫ్రీ బేసిక్స్‌ పేరుతో నెట్‌ న్యూట్రాలిటినీ దెబ్బతీసేందుకు ప్రయత్నాలు సాగించడంతో స్వేచ్ఛ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఉదృత పోరాటంతో దానిని అడ్డుకోవడం, ఇదే అంశంపై భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రారు) సంప్రదింపుల పత్రాన్ని రూపొందించడంతో 2016లో నెట్‌ న్యూట్రాలిటి అంశం హాట్‌ టాపిక్‌గా నిలిచిన విషయం విదితమే. ఇంటర్నెట్‌లోని కంటెంట్‌పై వివక్షతతో కూడిన విధానానికి దారితేసే ఒప్పందాలు చేసుకోకుండా నెట్‌ సేవలు అందించే సంస్ధలపై ఆంక్షలు విధించాలని టెలికాం రెగ్యులేటరి అథార్టీ ఆఫ్‌ ఇండియా (ట్రారు) సిఫార్సు చేసింది. నేషనల్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌-2018 పేరుతో రూపొందించిన కొత్త టెలికాం విధానాన్ని కూడా టెలికాం కమిషన్‌ ఆమోదించిందని, దీనికి కేబినెట్‌ ఆమోదం కోరాల్సి ఉందని సుందర్‌ రాజన్‌ చెప్పారు. అన్ని గ్రామ పంచాయతీలలోనూ దాదాపు 12.5 లక్షల వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేసేందుకు టెలికాం కమిషన్‌ ఆమోదించిందని సంబంధిత అధికారి తెలిపారు.