కాబోయే భర్తతో ఆలయానికి ఇషా అంబానీ

కాబోయే భర్తతో ఆలయానికి ఇషా అంబానీ

  ముంబై : దేశీ కార్పొరేట్‌ దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్, మేనేజింగ్‌  డైరెక్టర్‌ (సీఎండీ) ముకేశ్‌ అంబానీ ఏకైక కుమార్తె ఇషా అంబానీతో ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్‌ అజయ్‌ పిరమల్‌ కుమారుడు ఆనంద్‌ పిరమల్‌ వివాహం నిశ్చయమైనట్టు తెలిసింది. వీరిద్దరి పెళ్లి డిసెంబర్‌లో జరగనుందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. త్వరలో మనువాడబోతున్న వీరిద్దరూ ఆదివారం రాత్రి ముంబైలోని ఇస్కాన్‌ ఆలయాన్ని దర్శించుకున్నట్టు తెలిసింది. ఇరువురి కుటుంబ సభ్యులతో ఇషా, ఆనంద్‌ ఇస్కాన్‌ ఆలయానికి వెళ్లారు. కాగా, ఇటీవలే ఇషా సోదరుడు ఆకాశ్‌ అంబానీ వివాహం కూడా రసెల్‌ మెహతా కూతురు శ్లోకా మెహతతో నిశ్చియమైన సంగతి తెలిసిందే. 

ముఖేష్‌కు కవల పిల్లలైన ఇషా, ఆకాశ్‌ల పెళ్లిళ్లతో అంబానీ ఇంట సందడి నెలకొంది. త్వరలో ఒకటి కాబోతున్న ఆనంద్‌, ఇషాలు కూడా ఎంతో కాలంగా స్నేహితులు కావడం విశేషం. అంతేకాక ఇరువురి కుటుంబాలకు కూడా నాలుగు దశాబ్దాలుగా మంచి పరిచయాలు ఉన్నాయి. మహాబలేశ్వరం ఆలయంలో ఆనంద్‌, ఇషాకు ప్రపోజ్‌ చేశారు. ఇందుకు ఇషా అంగీకరించడం, వెంటనే ఇరు కుటుంబాలు ఓ విందు కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది. ఈ విందు కార్యక్రమంలో ముకేశ్‌ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ, ఆనంద్‌ తల్లిదండ్రులు అజయ్, స్వాతిలతోపాటు ఇషా నానమ్మ, అమ్మమ్మలు కోకిలాబెన్‌ అంబానీ, పూర్ణిమాబెన్‌ దలాల్, సోదరులు ఆకాశ్, అనంత్‌లు పాల్గొన్నారు. ఆనంద్‌ సోదరి నందిని ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిసింది.