పెట్రో ధరలు: మరో శుభవార్త!

పెట్రో ధరలు: మరో శుభవార్త!

  ముంబై:  పెట్రో షాక్‌నుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న వాహనదారులకు మరో శుభవార్త.  గత నెలలో పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు ఇంకా కొనసాగుతోంది.  ఈ క్రమంలో వచ్చే 15 రోజుల్లో ఇంధన ధరలు లీటరుకు మరో 5 రూపాయలకు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలుపై పరిమితులపై భారత్, చైనా, జపాన్‌ సహా 8 దేశాల నుంచి మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో  ధరలు మరింత దిగి వస్తాయని భావిస్తున్నారు.  ఈ ఉపశమనం తాత్కాలికమే అయినప‍్పటికీ  ఈ మేరకు సానుకూల ప్రభావం ఉండనుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచంలో ముడి చమురు వినియోగంలో మూడవ అతిపెద్ద వినియోగదారు భారత్‌కు చాలా ప్రయోజనం ఉంటుందని అంచనా. అయితే  ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు  కొనసాగుతాయి.

అంతర్జాతీయంగా ముడి చమురు  ధరలు బ్యారెల్‌కు 68 డాలర్లు రావచ్చని కూడా  కేడీయా కమోడిటీ మేనేజింగ్ డైరెక్టర్ అజరు కేడియా  పేర్కొన్నారు. అలాగే డాలరు మారకంలో రూపాయి విలువ రూ. 72.50 పైకి రాగలిగితే దేశంలో పెట్రోల్ ధర 5 రూపాయల మేర తగ్గవచ్చని  కేడియా చెప్పారు. దీంతోపాటు  ఒక రూపాయి డిస్కౌంట్‌ను ఉపసంహరించుకోవాలని,  చమురు మార్కెటింగ్ కంపెనీలను (హెచ్‌పీసీఎల్, బిపిసిఎల్, ఐఒసి) అడగవచ్చని.. ఇదే జరిగితే పెట్రో ధరలనుంచి భారీ ఉపశమనం లభిస్తుందని ఆయన విశ్లేషించారు. కాగా రికార్డు స్థాయిధరలో వాహన దారులకు చుక్కలు  చూపించిన పెట్రో ధరలు క్రమంగా నేలకు దిగి వస్తున్నాయి.  అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడంతో దేశంలో 18 రోజుల వ్యవధిలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.4.05 మేర క్షీణించిన సంగతి తెలిసిందే.