సిబ్బందిని రోబోల్లా చూస్తున్న అమెజాన్‌

సిబ్బందిని రోబోల్లా చూస్తున్న అమెజాన్‌

  న్యూయార్క్‌ : అమెజాన్‌, బ్రిటన్‌లోని తమ గోదాముల్లో పనిచేసే సిబ్బందిని మనుష్యుల్లా చూడడం లేదని, రోబోల్లా చూస్తోందని దర్యాప్తులో వెల్లడైంది. 2015-16 మధ్య కాలంలో అమెజాన్‌ గోదాముల్లో 400కి పైగా ప్రమాదకరమైన సంఘటనలు జరిగినట్లు ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చిందని జిఎంబి యూనియన్‌ దర్యాప్తులో తేలింది. పని ప్రదేశాల్లో జరిగిన ప్రమాదాలకు సంబంధించి అధికారిక నివేదికలను పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మూడేళ్ళ కాలంలో 600సార్లకు పైగా అంబులెన్సులను పని ప్రదేశాలకు రప్పించినట్లు తెలుస్తోంది. కాగా అమెజాన్‌ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. అమెజాన్‌ గిడ్డంగుల్లో ఏమామ్రూ సురక్షితం కాని పని పరిస్థితులు నెలకొన్నాయని జిఎంబి స్పష్టం చేసింది. 

తమపై పని భారం పెరగడంతో తీవ్రమైన ఇబ్బందుల పాలవుతున్నట్లు దాదాపు 200మంది యూనియన్‌ సభ్యులు వెల్లడించారు. కార్మికులు విధి నిర్వహణలో వుండగా జరిగిన ప్రమాదాల్లో కాళ్ళు చేతులు విరగడం, తలకు గాయాలు వంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘమైన పనిగంటల కారణంగా పనిపై దృష్టి కేంద్రీకరించలేక సిబ్బంది బాధపడుతున్నారు. కొన్ని చోట్ల ఏడాది మొత్తం పనిచేయాల్సిన పరిస్థితులే నెలకొని వుండగా, మరికొన్ని చోట్ల క్రిస్మస్‌ వంటి పండగల సీజన్‌లో పగలు రాత్రి బేధం లేకుండా పనిచేయాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు. ఇది తమ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని అన్నారు. కేవలం ఈ డేటాతోనే తమపై ఈ ఆరోపణలు చేయడం సరికాదని అమెజాన్‌ ప్రతినిధి స్పష్టం చేశారు.