సోషల్ మీడియా ప్రభంజనం!

సోషల్ మీడియా ప్రభంజనం!

 ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల విప్లవం పెల్లుబుకుతున్నది. ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రావడంపాటు చవకగా వివిధ ప్యాకేజీలు లభిస్తుండటంతో ప్రపంచం అరచేతిలోనే ఇమిడిపోతున్నది. సోషల్ మీడియాను ఉపయోగించే వారి సంఖ్య ఊహించనివిధంగా పెరుగుతున్నది. 2021 నాటికి కేవలం చైనా, భారత్ నుంచే 110 కోట్ల మంది వినియోగదారులు ఉండనున్నారు. 

ఈ సామాజిక మాధ్యమాలు తెలియని ఎన్నో కొత్త విషయాలను మన ముంగిట్లో ఉంచడంతోపాటు విడిపోయిన స్నేహాలను కూడా కలుపుతున్నాయి. వీటి వాడకంతో లాభాలున్నట్లే మితిమీరితే భారీనష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తృతస్థాయిలో అందుబాటులోకి వస్తున్న ఇంటర్నెట్ ప్రపంచ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేస్తున్నది. వరల్డ్‌వైడ్ వెబ్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ) మానస పుత్రికైన సోషల్ మీడియా పలు రూపాల్లో అందుబాటులోకి వస్తున్నది. 


ఇందులో బ్లాగ్స్, ఫోరమ్స్, బిజినెస్ నెట్‌వర్క్స్, సోషల్ గేమింగ్, మైక్రోబ్లాగ్స్, తదితర సామాజిక మాధ్యమ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. ఇదే వేగంతో గనుక యూజర్లు పెరిగితే, 2021 నాటికి నెలవారీ క్రియాశీల వినియోగదారుల సంఖ్య 302 కోట్లకు చేరుతుందని నిపుణులు అంటున్నారు. ఇది ప్రపంచ జనాభాలో మూడో వంతుకు సమానం. కేవలం చైనా నుంచి 2022 నాటికి 75 కోట్ల మంది, భారతదేశం నుంచే 35 కోట్ల మంది క్రియాశీలకంగా ఉంటారని అంచనా. ప్రస్తు తం ప్రపంచవ్యాప్తంగా 246 కోట్ల మంది సోషల్‌మీడియాను వినియోగిస్తున్నారు. అధిక క్రియాశీల రేటు కలిగిన ప్రాంతంగా ఉత్తర అమెరికా గుర్తింపు పొందింది.

ఇక్కడ దాదాపు 70% మంది కనీసం ఒక్క సామాజిక మాధ్యమంలో ఖాతాను కలిగి ఉన్నారు. 2017 లెక్కల ప్రకారం 81 శాతం మంది అమెరికన్లు సోషల్ నెట్‌వర్కింగ్ ప్రొఫైళ్లను కలిగి ఉన్నారు. తొలి సామాజిక మధ్యమంగా గుర్తింపు పొంది న ఫేస్‌బుక్ 2017 ప్రథమ త్రైమాసికంలో 100 కోట్ల మంది క్రియాశీల వినియోగదారుల స్థాయికి చేరింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.