స్పీల్‌బర్గ్‌తో జత కట్టిన ఆపిల్

స్పీల్‌బర్గ్‌తో జత కట్టిన ఆపిల్

 టీవీ ప్రోగ్రామింగ్‌లో తనదైన ముద్ర వేయడానికి ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్‌బర్గ్‌తో జతకట్టింది టెక్ మేజర్ ఆపిల్. 30 ఏళ్ల కిందటి స్పీల్‌బర్గ్ అమేజింగ్ స్టోరీస్ సంపుటిని మళ్లీ తీసుకువస్తున్నది. దీనిద్వారా ఆన్‌లైన్ వీడియో సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌లోకి ఎంటరై నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హులు, హెచ్‌బీవోలకు గట్టి పోటీ ఇవ్వాలని ఆపిల్ భావిస్తున్నది. అయితే ఆ సంస్థ మాత్రం దీనిపై స్పందించడానికి నిరాకరించింది. అమేజింగ్ స్టోరీస్ హక్కులు ఆపిల్‌కే దక్కాయని మొదట వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది. ఈ సిరీస్ 1985 నుంచి 1987 వరకు ఎన్‌బీసీ చానెల్‌లో ప్రసారమైంది. సైన్స్ ఫిక్షన్, హారర్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. 

ఐదు ఎమ్మి అవార్డులు కూడా గెలుచుకుంది. 1971లో సినిమాల్లోకి అడుగుపెట్టక ముందు టీవీ ప్రోగ్రామింగ్‌లో ఉన్న స్పీల్‌బర్గ్.. ఈ అమేజింగ్ స్టోరీస్‌తో మరోసారి బుల్లితెర వైపు వచ్చాడు. జాస్, జురాసిక్ పార్క్, ఇండియానా జోన్స్, సేవింగ్ ప్రైవేట్ రియాన్, లింకన్, షిండ్లర్స్ లిస్ట్‌లాంటి సూపర్ హిట్ మూవీస్‌ను స్పీల్‌బర్గ్ అందించాడు. కొత్తగా ఈ అమేజింగ్ స్టోరీస్‌ను తీసుకురావడానికి ఆపిల్ బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది. అయితే నెట్‌ఫ్లిక్స్‌లాంటి ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే ఇది చాలా తక్కువ మొత్తమే. నెట్‌ఫ్లిక్స్ ఏడాదికి 6 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.