14 వేల కోట్ల ఆదాయం లక్ష్యం..

14 వేల కోట్ల ఆదాయం లక్ష్యం..

 హైదరాబాద్ : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల విక్రయ సంస్థ షియోమీ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రూ.14 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మను జైన్ తెలిపారు. గతేడాది నమోదైన రూ.7 వేల కోట్ల ఆదాయంతో పోలిస్తే రెండింతలు పెరుగనున్నదన్న మాట. రాష్ట్ర మార్కెట్లోకి రెడ్మీ ఏ 5ఏ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రస్తుతం కంపెనీ ఆన్‌లైన్‌తోపాటు రిటైల్ కేంద్రాల్లో సైతం మొబైళ్లను విక్రయిస్తున్నట్లు చెప్పారు. మొత్తం మొబైల్ విక్రయాల్లో ఆన్‌లైన్ వాటా 70 శాతంగా ఉండగా, రిటైల్ వాటా 30 శాతమని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో మొబైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. ఎక్కడ, ఎంతమేర పెట్టుబడులు పెట్టేదానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. 2014లో దేశీయ మార్కెట్లోకి అడుగు పెట్టిన సంస్థ..ఇప్పటి వరకు రూ.3 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది.