2020 నాటికి ఇమేజ్ టవర్ సిద్ధం

2020 నాటికి ఇమేజ్ టవర్ సిద్ధం

  హైదరాబాద్ : ఇమేజ్ టవర్ 2019 చివరి నాటికి లేదా 2020 మొదటి త్రైమాసికానికి సిద్ధం కానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. 2017 చివరలో ప్రారంభమైన ఈ టవర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల్లోని అవకాశాలను కైవసం చేసుకునేందుకు ఇమేజ్ టవర్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది.

ఐటీ రంగ వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు క్రియాశీలంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందులో భాగంగా ఇమేజ్ టవర్ ఏర్పాటుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. రూ. 900 కోట్ల వ్యయంతో సాలార్‌పురియా నిర్మిస్తున్న ఈ టవర్‌ను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో నిర్మిస్తున్నట్టు జయేశ్ రంజన్ తెలిపారు. ఈ టవర్ నుంచి 200కు పైగా కంపెనీలు తమ వ్యాపార కార్యకలపాలను కొనసాగించవచ్చని ఆయన వివరించారు.

ఇందులో స్టూడియోలు, ప్రివ్యూ థియేటర్లు సహా మరికొన్నింటిని కామన్ ఫెసిలిటీ కింద అందించనున్నట్లు వెల్లడించారు. ఇమేజ్ టవర్‌లో కార్యకలాపాలు కొనసాగించే కంపెనీలకు సంబంధించిన ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుందని, మిగతా ధరను వాణిజ్య మార్కెట్ ప్రకారం నిర్ణయిస్తుందని వివరించారు. ఐటీ హబ్‌గా పేరొందిన సైబరాబాద్‌లో ఏర్పాటవుతున్న ఇమేజ్ టవర్ 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుందని తెలిపారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ రంగానికి హైదరాబాద్‌ను కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 2016లో ఇమేజ్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.