700 కోట్ల పెట్టుబడులకు సిద్ధం

700 కోట్ల పెట్టుబడులకు సిద్ధం

  న్యూఢిల్లీ : ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్‌వేస్‌ను ఆదుకోవడానికి రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ చైర్మన్ నరేష్ గోయల్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలియచేశారు. కానీ కంపెనీలో తన వాటా 25 శాతం తగ్గకుండా ఉండేందుకోసమే ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. కంపెనీలో వ్యూహాత్మక భాగస్వామి అయిన ఎతిహాద్..కంపెనీ నాయకత్వ బాధ్యతల నుంచి గోయల్ తప్పుకోవాలని షరతు విధించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌కు రాసిన లేఖలో సంస్థలో తనకున్న షేర్లను తాకట్లు పట్టైన రూ.700 కోట్ల వరకు నిధులు చొప్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ ఈ మొత్తంతో కంపెనీలో తనకున్న వాటా 25 శాతం తగ్గకుండా చూడాలని షరతు విధించారు. ఒకవేళ ఇది సాధ్యంకాకపోతే..తాను కంపెనీలో పెట్టుబడులు పెట్టడం, షేర్లను తాకట్టుపెట్టడం కూడా సాధ్యం కాదని ఈ లేఖలో హెచ్చరించారు. లేకపోతే టేకోవర్ నిబంధనలు అమలు చేయకుండా సంస్థలో తన వాటాను 25 శాతానికి పెంచుకునేలా స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతించాలని ఆయన కోరారు.