ఆకట్టుకున్న హెచ్‌యూఎల్

ఆకట్టుకున్న హెచ్‌యూఎల్

  న్యూఢిల్లీ : ఎఫ్‌ఎంసీజీలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన హిందుస్థాన్ యునీలీవర్(హెచ్‌యూఎల్) ఆర్థిక ఫలితాలు ఆకట్టుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,444 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నమోదైన రూ.1,326 కోట్ల లాభంతో పోలిస్తే 9 శాతం వృద్ధి కనబరిచింది. అమ్మకాలు పెరుగడం, మార్జిన్లు అధికమవడం ఇందుకు దోహదం చేశాయి. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12.42 శాతం ఎగబాకి రూ.9,357 కోట్లకు చేరుకున్నట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. 

విలువ పరంగా చూస్తే దేశీయ అమ్మకాల్లో 13 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, ఎబిటా మార్జిన్లు 170 బేసిస్ పాయింట్లు అధికమయ్యాయని కంపెనీ సీఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. గత త్రైమాసికంలో సంస్థ అన్ని రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచిందని, అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదైందన్నారు. సమీక్షకాలంలో నిర్వహణ ఖర్చులు రూ.7,036 కోట్ల నుంచి రూ.7,652 కోట్లకు పెరిగాయి. రంగాల వారీగా చూస్తే హోమ్ కేర్ విభాగం నుంచి రూ.3,148 కోట్ల ఆదాయం సమకూరగా, పర్సనల్‌కేర్ ఉత్పత్తుల ద్వారా రూ.4,539 కోట్లు, ఆహార రంగాల నుంచి రూ.1,728 కోట్ల ఆదాయం లభించినట్లు వెల్లడించింది. స్వల్పకాలంపాటు డిమాండ్ నిలకడగా ఉండే అవకాశం ఉందన్న ఆయన..దేశ ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.