ఎయిరిండియా ఆస్తుల విక్రయం

ఎయిరిండియా ఆస్తుల విక్రయం

  న్యూఢిలీ : ప్రభుత్వ రంగంలోని ఎయిరిండియా (ఎఐ) ఆస్తులను విభజించి విక్రయించడానికి కావాల్సిన ప్రణాళికలను మోడీ సర్కార్‌ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్ధిక సంవత్సరం (2019-20)లో ఎఐకి చెందిన రూ.7,000 కోట్ల ఆస్తులను విక్రయించనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒక్కరు వెల్లడించారు. ఎఐకి చెందిన అనుబంధ సంస్థల్లోని వాటాలను వచ్చే ఆర్ధిక సంవత్సరం ద్వితీయార్థంలో ఉపసంహరించుకోవడానికి కసరత్తు జరుగుతుందన్నారు. ఎఐ ప్రస్తుతం రూ.55,000 కోట్ల అప్పుల్లో ఉంది. గతంలో రెండు సార్లు ఆస్తుల విక్రయానికి సిద్ధమై విఫలమైన విషయం తెలిసిందే. ఇందులోని 76 శాతం వాటాను విక్రయించడం ద్వారా ప్రయివేటు కంపెనీ లకు దీన్ని కట్టబెట్టాలని ఆ సమయంలో ప్రయత్నించారు. 

కొనుగోలుదారులకు రూ.24వేల కోట్ల వరకు అప్పులు, రూ.8,000 కోట్ల లయబిలిటీస్‌ ఇవ్వడానికి అంగీకరించింది. దీనికి సంబంధించి మే 31 వరకు దరఖాస్తులను స్వీకరించింది. కాని ఏ ఒక్క పెట్టుబడిదారుడు కూడా కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఎఐని పునరుద్దరించాలని కేంద్రం భావించింది. దీంతో 2018 ఆగస్టులో రూ.980 కోట్ల మూలధనం అందించడానికి పార్లమెంట్‌ ఆమోదం తీసుకుంది. కాగా ఇప్పటికే ముంబయిలోని ఎయిర్‌లైన్స్‌ హౌస్‌, ఢిల్లీ, వసంత్‌విహార్‌, బాబా ఖరక్‌సింగ్‌ మార్గ్‌, కన్నాట్‌ ప్రాంతాల్లోని ఆస్తులను విక్రయించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది.