అమ్మకానికి ఎయిరిండియా అనుబంధ సంస్థ..!

అమ్మకానికి ఎయిరిండియా అనుబంధ సంస్థ..!

  న్యూఢిల్లీ : ఎయిరిండియాకు చెందిన అనుబంధ సంస్థ ఎఐఎటిఎస్‌ఎల్‌ విక్రయానికి కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. లాభాలు వచ్చే ఈ కంపెనీ అమ్మకంతో నిధులు సమీకరించి ఎయిరిండియా (ఎఐ) అప్పులను తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. ఎఐ పునర్జీవం కోసం కార్గో సేవలందించే ఎయిరిండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు సర్వీస్‌ (ఎఐఎటిఎస్‌ఎల్‌)లో కీలక వాటాలను విక్రయించడానికి ప్రణాళికలు రూపొందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2017 మార్చి నాటికి ఎఐ రూ.48వేల కోట్ల అప్పుల భారంతో ఉన్న విషయం తెలిసిందే. ఎఐఎటిఎస్‌ఎల్‌ను విక్రయించడానికి కసరత్తు జరుగుతోందని ఓ అధికారి తెలిపారు.

ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తర్వాత అతిత్వరలోనే ఆసక్తి కలిగిన బిడ్డర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నామని తెలిపారు. క్రితం జూన్‌లో మంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన జరిగిన మినిస్ట్రర్‌ ప్యానెల్‌లో ఎఐ అప్పులు తగ్గించడానికి ఆ సంస్థ ఆస్తులను, భూములను, సబ్సీడరీలను విక్రయించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఎఐలో 76 శాతం వాటా విక్రయానికి బిడ్లను పిలిచినప్పటికీ ఏ ఒక్క కంపెనీ ముందుకు రాలేదు. మే 31 వరకు ఈ దరఖాస్తులకు చివరి తేదిగా నిర్ణయించారు. కాని ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో తిరిగి జూన్‌లో మరోమారు జైట్లీ బృందం దీనిపై చర్చించింది.2016-17లో ఎఐఎటిఎస్‌ఎల్‌ రూ.61.66 కోట్ల లాభాలు సాధించింది.

మరో సబ్సీడరీ ఎఐ ఎక్స్‌ప్రెస్‌ రూ.297 కోట్ల లాభాలు ఆర్జించింది. ఎయిరిండియా చార్టర్స్‌ లిమిటెడ్‌, ఐఎఎల్‌ ఎయిర్‌పోర్టు సర్వీసెస్‌ లిమిటెడ్‌, ఎయిర్‌లైన్‌ అలైడ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, హోటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలు ఎఐకి అనుబంధ కంపెనీలుగా ఉన్నాయి. కేటరింగ్‌ సర్వీసు కంపెనీ ఎఐశాట్స్‌లో ఎఐ, శాట్స్‌ లిమిటెడ్‌లు 50:50 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. ఈ సంస్థ కూడా 2016-17లో రూ.66.07 కోట్ల లాభాలు సాధించింది. ఎయిర్‌పోర్టు గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌, ర్యాంప్‌, సెక్యూరిటీ, కార్గో తదితర సేవలందించడానికి ఎఐఎటిఎస్‌ఎల్‌ను 2003లో ఎఐ 100 శాతం పెట్టుబడులతో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ పౌర విమానయాన మంత్రిత్వశాఖ పరధిలో పని చేస్తుంది. ఇంతకాలం పలు ప్రభుత్వాలు ప్రయివేటు విమానయాన కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఎఐని నిర్వీర్యం చేశారనే విమర్శలున్నాయి. ఎయిరిండియాకు సరైన కాలంలో సారథులను నియమించకపోవడం, లాభాల్లో వచ్చే రూట్లను ప్రయివేటు కంపెనీలకు అప్పగించడం తదితర పరిణామాలు ఎఐ ఆర్ధిక పరిపుష్టిని దెబ్బతీశాయి.