>

ఆపిల్ కీలక ఉద్యోగిని గూగుల్ తీసేసుకుంది!

ఆపిల్ కీలక ఉద్యోగిని గూగుల్ తీసేసుకుంది!

 లాస్ ఏంజిల్స్ : హై-ఎండ్ ఆపిల్ ఐఫోన్లకు ధీటుగా గూగుల్ తన సొంత బ్రాండులో పిక్సెల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐఫోన్లకు మరింత పోటీనిచ్చేందుకు తను తర్వాత తీసుకురాబోతున్న ఫ్లాగ్ షిప్ పిక్సెల్ ఫోన్ కోసం ఏకంగా ఐఫోన్ల, ఐప్యాడ్ ల చిప్ ఆర్కిటెక్ట్ ను గూగుల్ తీసేసుకుంది. భారతీయ సంతతి ఇంజనీర్ మను గులాటిని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన కంపెనీలోకి నియమించుకుంది. మైక్రో-ఆర్కిటెక్ట్ గా ఎనిమిదేళ్లుగా గులాటి ఆపిల్ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన గూగుల్ లో లీడ్ ఎస్ఓసీ ఆర్కిటెక్ట్ గా చేరినట్టు తెలిసింది. 

 

ప్రస్తుతం గులాటి ఆపిల్ నుంచి బయటికి వచ్చేయడం ఆ కంపెనీకి ఎదురుదెబ్బని పలువురంటున్నారు. చిప్ లకు సంబంధించి చాలా పేటెంట్లు ఆయన వద్దనే ఉన్నాయి. అంతేకాక వాటి వ్యవస్థాపకుడిగా గులాటికే క్రెడిట్ అంతా దక్కుతోంది. చిప్ డిజైన్ లో ఆయన 15 ఆపిల్ పేటెంట్ రైట్లను కలిగి ఉన్నారు. గూగుల్ సొంతంగా ఓ ప్రాసెసర్ ను అభివృద్ధి చేయాలని ప్లాన్ వేస్తోంది. తర్వాతి పిక్సెల్ స్మార్ట్ ఫోన్లకు సొంత చిప్ సెట్ల కోసం చిప్ నిపుణుల టీమ్ ను కూడా కంపెనీ భారీగా పెంచుతోంది. ప్రస్తుతం ఆపిల్ కు సొంత స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్లు ఉన్నాయి. కానీ గూగుల్ కు అలాంటివేమీ లేవు. గూగుల్ పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ ఫోన్లకు క్వాల్ కామే తన స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ లను సప్లై చేస్తోంది. దీంతో గూగుల్ కూడా సొంతంగా ప్రాసెసర్ల రెడీకి సిద్ధమైంది.

 

ఆపిల్ కొత్త చిప్ లు ఏ10ఎక్స్.  ఇంటెల్, క్వాల్ కామ్ లకు బదులుగా ఆపిల్ సొంతంగా చిప్ లను తయారుచేసుకుంది. గతంలో 2010ఐప్యాడ్ ఏ4, ఏ9 చిప్ లకు గులాటినే బాధ్యత వహించేవారు. గులాటి అంతకముందు బ్రాడ్ కామ్,  ఏఎండీల్లో కూడా పనిచేశారు. గులాటి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఆయన గూగుల్ లో చేరిన విషయాన్ని ధృవీకరిస్తోంది. ఆయన ప్రొఫైల్ లో గూగుల్ లీడ్ ఎస్ఓసీ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది. 


Loading...