బిగ్‌బజార్‌లో వాటాపై అమెజాన్‌ దృష్టి..!

బిగ్‌బజార్‌లో వాటాపై అమెజాన్‌ దృష్టి..!

  ముంబయి : అమెరికాకు చెందిన ఇ-కామర్స్‌ దిగ్గజం భారత రిటైల్‌ రంగంపై కన్నేసింది. ఈ దృష్టితోనే బిగ్‌ బజార్‌, నీలగిరి సూపర్‌ మార్కెట్లలో 9.5 శాతం వాటాల కొనుగోలుకు సిద్దం అయ్యిందని ఇటి నౌ ఒక కథనం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన డీల్‌ను ఈ నెలలోనే పూర్తి చేయనుందని, ఈ నెల 14న బోర్డు ఆమోదం పొందిన తర్వాత ఈ ఒప్పందాన్ని అధికారికంగా వెల్లడించనుందని తెలుస్తోంది.ఈ కొనుగోలు విలువ రు. 2,500 కోట్లుగా ఉండొచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఫ్యూచర్స్‌ రిటైల్‌ సంస్థకు దాదాపు దేశం మొత్తం మీద 1,100 బిగ్‌బజార్‌, నిలగిరి స్టోర్లు ఉన్నాయి. వాటా విక్రయానికి సంబంధించిన ఒప్పంద పత్రాలు కూడా సిద్ధమయ్యాయని, బోర్డ్‌ ఆమోదం ఒక్కటే మిగిలి ఉందని ఫ్యూచర్స్‌ రిటైల్స్‌ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అమెజాన్‌ షాపర్స్‌ స్టాప్‌లో 5శాతం వాటాలను సొంతం చేసుకుంది. అలాగే అమెజాన్‌ ఆదిత్య బిర్లా రిటైల్స్‌ లో కూడా విట్‌ జిగ్‌ ఎడ్వైజరీస్‌, సమారా క్యాపిటల్‌ సంస్థలతో కలిసి పెట్టుబడులను పెట్టింది. అమెజాన్‌ భారత్‌లో దాదాపు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులను కుమ్మరించడానికి సిద్దమయ్యింది. ఫుడ్‌, ప్రాసెసింగ్‌ విభాగాల్లో 500 మిలియన్‌ డాలర్ల పెట్టబడులకు భారత ప్రభుత్వం అనుమతించింది.