కార్పొరేట్ చరిత్రలో ఇదే గరిష్ఠం

కార్పొరేట్ చరిత్రలో ఇదే గరిష్ఠం

 న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్నది. కార్పొరేట్ చరిత్రను తిరగరాస్తూ ఒక త్రైమాసికంలో రూ.10 వేల కోట్లకు పైగా నికర లాభాన్ని ఆర్జించిన సంస్థగా రికార్డు పుటల్లోకి ఎక్కింది. రిఫైనింగ్ మార్జిన్లు తగ్గుముఖం పట్టినప్పటికీ పెట్రో కెమికల్స్, రిటైల్, డిజిటల్ సేవల విభాగాల్లో మెరుగైన పనితీరు కనబర్చడం ఇందుకు దోహదం చేశాయి. చమురు నుంచి టెలికం వరకు సేవలు అందిస్తున్న సంస్థకు డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.10,251 కోట్ల(ప్రతిషేరుకు రూ.17.3) కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదుచేసుకున్నది. గతేడాది ఇదే సమయంలో వచ్చిన రూ.9,420 కోట్లతో పోలిస్తే 8.82 శాతం వృద్ధిని కనబరిచింది. మూడు నెలల్లో ఇంతటి లాభాన్ని ఆర్జించిన ప్రైవేట్ సంస్థగా ఆర్‌ఐఎల్ నిలిచింది. గతంలో ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) జనవరి-మార్చి 2013 మధ్యకాలంలో రూ.14,512.81 కోట్ల లాభాన్ని గడించింది. 

ఆదాయం విషయానికి వస్తే అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికి రూ.1,71,336 కోట్లు ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే 56 శాతం ఎగబాకింది. వరుసగా 16 త్రైమాసికాలుగా లాభాలు ఆర్జించిన సంస్థగా మరో రికార్డును నెలకొల్పింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడంతో చమురు రిఫైనింగ్ బిజినెస్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ రిటైల్ స్టోర్ల సంఖ్యను పెంచడం, జియో వినియోగదారులు సంఖ్య భారీగా పెరుగడం లాభాలు పుంజుకోవడానికి దోహదపడ్డాయని ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. కంపెనీ చరిత్రలో గడిచిన త్రైమాసికం మరో మైలురాయిగా నిలిచిందని, ముఖ్యంగా లాభాల్లో పది వేల కోట్ల రూపాయలు దాటడంతో వాటాదారులు, దేశ విలువ కూడా మరింత పెరిగిందని ఆర్థిక ఫలితాల సందర్భంగా ఆయన వెల్లడించారు. చమురు ధరలు తీవ్ర ఆటోపోటులకు గురైనప్పటికీ పనితీరు మెరుగుపడటం విశేషమన్నారు.