దివాలా స్థితిలో లాంకో

దివాలా స్థితిలో లాంకో

  న్యూఢిల్లీ: దేశంలో మౌలిక వసతుల రంగంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన లాంకో ఇన్ఫ్రాటెక్‌ సంస్థ ఇప్పుడు దివాలా దిశగా పయనిస్తోంది. గత ఏడాది రిజర్వ్‌ బ్యాంకు దివాలా కోర్టులకు నివేదించిన 12 బడా ఎగవేత దారుల జాబితాలో లాంకో ఇన్‌ఫ్రాటెక్‌ పేరుండటమే ఇందుకు నిదర్శనం. తమ గ్రూప్‌లోని త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ సంస్థ గత వారం పంపిన దివాలా ప్రణాళిక తీర్మానాన్ని తాము ఆమోదించలేమని తమ రుణదాత సంస్థలు స్పష్టం చేశాయని లాంకో కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ తీర్మానం సంస్థాగతమైనదని, కంపెనీ దివాలా ప్రతిపాదన ఆమోదం కోసం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ముందు తాము అవసరమైన దరఖాస్తును అందచేస్తామని తెలిపింది.

లాంకో ఇన్ఫ్రాటెక్‌ సంస్థ తన రుణదాతలకు దాదాపు రు.50 వేల కోట్లకు పైగానే బకాయి పడినట్లు తెలుస్తోంది. 'దివాలా చట్టం 2016 నియమ, నిబంధనల ప్రకారం త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ సంస్థ రుణదాతల కమిటీ (సిఓసి)కి అందచేసిన తీర్మానం పూర్తిగా సంస్థాగతమైనదని లాంకో ఇన్ఫ్రాటెక్‌ సంస్థ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ తీర్మానానికి అనుకూలంగా 75 శాతం కన్నా తక్కువ ఓట్లు లభించి నందున దీనిని సిఓసి ఆమోదించ లేదని ఆ సంస్థ తన ఫైలింగ్‌లో వివరించింది. విద్యుత్‌ ఉత్పాదన, మౌలికవసతుల రంగాలలో వున్న లాంకో సంస్థ దివాలా తీర్మానాన్ని అమలు చేసేందుకు వున్న 270 రోజుల గడువు శుక్రవారంతో పూర్తి కావటంతో ఆ సంస్థ ఈ మేరకు స్టాక్‌ఎక్స్చేంజ్‌లో ఫైలింగ్‌ చేసింది.

కార్పొరేట్‌ దివాలా తీర్మానం గడువు ముగిసినందున నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ముందు అవసరమైన దివాలా పిటిషన్‌ను తాము దాఖలు చేస్తామని లాంకో సంస్థ తెలిపింది. లాంకో సంస్థకు అత్యధికంగా రుణాలిచ్చిన సంస్థల్లో రు.7,380 కోట్లతో ఐసిఐసిఐ బ్యాంకు మొదటి స్థానంలో వుండగా తరువాత రు.3,608 కోట్లతో ఐడిబిఐ బ్యాంకు రెండో స్థానంలో నిలిచింది. ఈ బ్యాంకులు లాంకో సంస్థను గత ఏడాది ఆగస్టులో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించాయి. దివాలా క్రమంలో లాంకో తరువాతి స్థానంలో రు.30 వేల కోట్ల బాకీలతో అలోక్‌ ఇండిస్టీస్‌, తరువాతి స్థానంలో రు.18,539 కోట్ల బకాయిలతో ఎబిజి షిప్‌యార్డ్‌ నిలిచాయి.