ఈఈఎస్‌ఎల్ సీలింగ్ ఫ్యాన్ల ధర తగ్గింపు

ఈఈఎస్‌ఎల్ సీలింగ్ ఫ్యాన్ల ధర తగ్గింపు

 న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ ఎనర్జీ ఎఫిసెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్)..ఉజాలా స్కీం కింద విక్రయిస్తున్న సీలింగ్ ఫ్యాన్ల ధరలను రూ.1,200 నుంచి రూ.1,100కి తగ్గించినట్లు ప్రకటించింది. ఫ్యాన్లపై విధిస్తున్న వస్తు, సేవల పన్నును(జీఎస్టీ) 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు మళ్లించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో 50 వాట్ కలిగిన ఫ్యాన్ ధరను రూ.1,100కి తగ్గించింది. 

కానీ 9వాట్ల ఎల్‌ఈడీ బల్బు(రూ.70), 20 వాట్ల ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్(రూ.220) ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. మార్చి 2019 నాటికి దేశవ్యాప్తంగా 77 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే 27.63 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు, 41,74 లక్షల ట్యూబ్‌లైట్లు, 14 లక్షల ఫ్యాన్లను సంస్థ విక్రయించింది. ఈ ఎల్‌ఈడీ బల్బులను వాడటంతో ప్రతియేటా 7,304 మెగావాట్ల విద్యుత్ ఆదా కానున్నది. విలువ పరంగా చూస్తే రూ.14,470 కోట్లు.