జర్మనీ ఆర్థిక వ్యవస్థకు భారత్ దన్ను

జర్మనీ ఆర్థిక వ్యవస్థకు భారత్ దన్ను

 న్యూఢిల్లీ : గతేడాది జర్మనీలో భారతీయ సంస్థలు దాదాపు రూ.87,506 కోట్ల (11.4 బిలియన్ యూరోలు) ఆదాయాన్ని, 27,400 ఉద్యోగాల్ని సృష్టించాయి. ఈ మేరకు దేశీయ పారిశ్రామిక సంఘం సీఐఐ-ఈవై-బెర్టెల్స్‌మన్ ఫౌండేషన్ అధ్యయనం చెబుతున్నది. కాగా, జర్మనీలోని భారతీయ కంపెనీల సీఈవోలు తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడి సంస్థల ఆదాయంలో 40 శాతం మెటల్స్, 29 శాతం ఆటోమోటివ్స్ విభాగాల నుంచే వస్తున్నది. టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, సోనా ఆటోక్యాంప్ సంస్థలు ఈ రంగాల్లోని ప్రధాన భారతీయ సంస్థలుగా ఉన్నాయి. ఇక ఐటీ రంగం వాటా మాత్రం 9 శాతంగానే ఉన్నది. 2010 నుంచి గమనిస్తే పెట్టుబడులపరంగా సుమారు 140 భారీ ప్రాజెక్టులను భారతీయ కంపెనీలు జర్మనీలో తీసుకొచ్చాయి. 

2010-2016 మధ్య భారతీయ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అత్యధికంగా అందుకున్న యూరప్ దేశాల్లో 96 ప్రాజెక్టులతో జర్మనీ రెండో స్థానంలో ఉంది. జర్మనీలోని ఆటోమోటివ్ ఇండస్ట్రీ, మెటల్, మెటల్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ప్రొఫెషనల్, టెక్నికల్, సైంటిఫిక్ సర్వీసెస్, కెమికల్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, యంత్రాల తయారీ రంగాల్లో భారతీయ సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. కొత్తదనం, సాంకేతికతల వల్లే జర్మనీలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నామని ఇక్కడున్న భారతీయ కంపెనీలకు చెందిన సీఈవోల్లో 80 శాతం మంది తెలిపారు.

కాగా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలుగడం (బ్రెగ్జిట్), ప్రాంతీయ మార్కెటింగ్‌పైనే జర్మనీలో భారతీయ సంస్థల భవిష్యత్ పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని పలువురు సీఈవోలు అభిప్రాయపడ్డారు. ఈయూ నుం చి బ్రిటన్ వైదొలిగితే ఆ పెట్టుబడులు జర్మనీకి వచ్చే వీలుంది. ఈయూ దేశాలతో సత్సంబంధాల కొనసాగింపునకు భారతీయ కంపెనీలు తప్పక ఈ పని చేయాల్సిందే.