గోద్రేజ్ ఫ్రిజ్, ఏసీలు ప్రియం?

గోద్రేజ్ ఫ్రిజ్, ఏసీలు ప్రియం?

 ముంబై : గోద్రేజ్ రిఫ్రిజిరేటర్లు, ఎయిర్-కండీషనర్ల ధరలు పెరిగే అవకాశాలున్నాయి. తయారీ ఖర్చులు భారమైన నేపథ్యంలో వివిధ గృహోపకరణాల ధరలను 3 నుంచి 6 శాతం పెంచే యోచనలో కంపెనీ ఉంది. ఉత్పాదక వ్యయం పెరిగిన దృష్ట్యా ధరలను పెంచక తప్పేట్లు లేదనిపిస్తున్నది. ఈ నెలగానీ, వచ్చే నెలగానీ ధరలు పెరగొచ్చు. పెంపు ప్రభావం అధికంగా ఫ్రిజ్, ఏసీలపై ఉండొచ్చు అని గోద్రేజ్ అప్లియెన్సెస్ వ్యాపారాధిపతి, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు కమల్ నంది పీటీఐతో మాట్లాడుతూ సంకేతాలిచ్చారు. 

ఈ ఏడాది జనవరి నుంచి స్టీల్ ధరలు 10-15 శాతం, ప్లాస్టిక్స్ 6-7 శాతం, కాపర్ 40-50 శాతం, ఫోమింగ్ కెమికల్ ఎమ్‌డీఐ ధర గరిష్ఠంగా 140 శాతం మేర పెరిగినట్లు ఆయన గుర్తుచేశారు. దీంతోపాటు ఫ్రిజ్‌లు, ఏసీలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 28 శాతంగా ఉందన్న ఆయన వీటన్నింటి దృష్ట్యా ధరల పెంపు అనివార్యమవుతున్నదన్నారు. కంపెనీ రెవెన్యూలో ప్రస్తుతం రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ల వాటానే దాదాపు 75 శాతంగా ఉంది. వచ్చే ఏడాది మార్చికల్లా రూ.4,000 కోట్ల టర్నోవర్‌ను సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.