>

హైబ్రిడ్ విత్తనాలపై 10% తగ్గింపు

హైబ్రిడ్ విత్తనాలపై 10% తగ్గింపు

 న్యూఢిల్లీ : ఈనెల 19 నుంచి పత్తి మినహాయించి మిగతా హైబ్రిడ్ విత్తనాల ధరలను 10 శాతం తగ్గించాలని ఇండస్ట్రీ నిర్ణయించింది. దీంతో రైతులకు ఖరీఫ్ సీజన్‌లో పంటసాగు వ్యయం నుంచి స్వల్ప ఊరట లభించే అవకాశం ఉంటుంది. విత్తన పరిశ్రమ ప్రతినిధులతో శుక్రవారం నాడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనార్థం హైబ్రిడ్ విత్తనాల ధరలను తగ్గించాలని పరిశ్రమ వర్గాలను కోరాం.

అందుకు వారు అంగీకరించారు అని అన్నారు. అనంతరం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. హైబ్రిడ్ విత్తనాల గరిష్ఠ చిల్లర విక్రయ ధరను(ఎంఆర్‌పీ) పది శాతం మేర తగ్గించినందుకు గాను విత్తన పరిశ్రమ వర్గాలను అభినందిస్తున్నాను అని పేర్కొన్నారు. పత్తి విత్తనాలను ఇప్పటికే ప్రభుత్వం నియంత్రిస్తున్నందన తాజాగా ప్రకటించిన తగ్గింపు వాటికి వర్తించదు. హైబ్రిడ్ విత్తనాల ధర రూ.300 నుంచి రూ.500 స్థాయిలో ఉంది. 

వ్యవసాయం అంత లాభసాటిగా లేనందున రైతులు ఆర్థికపరంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, అందువల్ల విత్తనాల ధరలను తగ్గించాలని తాజా సమావేశంలో మంత్రి తమ ఇండస్ట్రీని కోరారని నేషనల్ సీడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం ప్రభాకర్ రావు అన్నారు. దాంతో ఇండస్ట్రీ కలిసి చర్చించుకొని ధరలను పది శాతం మేర తగ్గించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

తగ్గించిన ధరలకే విత్తనాలు ఏడాది పొడుగునా అందుబాటులో ఉంటాయా అన్న ప్రశ్నకు ప్రభాకర్ రావు సమాధానమిస్తూ.. ప్రస్తుతానికైతే ఖరీఫ్ సీజన్ కోసం మాత్రమే ధరలు తగ్గించడం జరిగిందని, యాసంగి పంట కోసం విత్తన ధరల తగ్గింపుపై తరువాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. దేశంలో పంట సాగు కోసం ఉపయోగించే విత్తనాల్లో 80 శాతం హైబ్రిడ్ రకానివే. దేశీయ హైబ్రిడ్ విత్తన మార్కెట్ రూ.6,000 కోట్ల స్థాయికి చేరుకుంది.


Loading...