హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు బీఏ1 రేటింగ్

హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు బీఏ1 రేటింగ్

 హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌కు(జీహెచ్‌ఐఏఎల్) ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్.. తొలిసారి కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్ బీఏ1ను ఇచ్చింది. మార్కెట్‌లో జీహెచ్‌ఐఏఎల్‌కున్న బలమైన స్థానం, హైదరాబాద్‌లో దాని వ్యూహాత్మక ప్రాంతాలను ప్రాథమికంగా బీఏ1 కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్ ప్రతిబింబిస్తుందని మూడీస్ ఉపాధ్యక్షుడు, సీనియర్ విశ్లేషకుడు అభిషేక్ త్యాగీ అన్నారు. 

మరో రెండు, మూడేండ్లకుపైగా జీహెచ్‌ఐఏఎల్ జోరు కొనసాగగలదన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా త్యాగీ వెలిబుచ్చారు. జీహెచ్‌ఐఏఎల్ ఆర్థిక పరిస్థితులు కూడా బాగున్నాయన్న ఆయన ఎయిర్‌పోర్టుకు పెరుగుతున్న రద్దీతో సంస్థ ఆదాయం మున్ముందు మరింత పెరుగవచ్చన్నారు. ప్రస్తుతం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్.. దేశ, విదేశాల్లోనూ పలు అంతర్జాతీయ విమానాశ్రయాలను నడుపుతున్న విషయం తెలిసిందే. రాబోయే నాలుగేండ్లలో రూ. 2,500 కోట్ల పెట్టుబడులతో విస్తరణ ప్రణాళికనూ సిద్ధం చేస్తున్నది.